గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అసెంబ్లీ ఎన్నికల్లో సాంక్వెలిమ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భారతీయ జనతా పార్టీ గురువారం ప్రకటించింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, గోవా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ దేవేంద్ర ఫడ్నవీస్‌ 34 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ జాబితా ప్రకారం ప్రస్తుత పనాజీ ఎమ్మెల్యే అటానాసియో 'బాబుష్' మాన్‌సెరాట్‌కు టికెట్ ఇవ్వగా, మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్‌కు టిక్కెట్ దక్కలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన రెండూ ఉత్పల్‌కు తమ పార్టీల నుంచి టిక్కెట్ ఆఫర్ చేశాయి. 


Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు


గోవా మాజీ సీఎం, కేంద్రమంత్రి మనోహర్ పారికర్ నియోజకవర్గమైన పనాజీ నుంచి ఉత్పల్‌ను పోటీలో నిలపాలన్న ప్రశ్నకు ఫడ్నవీస్ స్పందిస్తూ.. పారికర్ కుటుంబం ఎల్లప్పుడూ బీజేపీదే. అయితే ఉత్పల్ పోటీ చేయాలనుకున్న స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను వదులుకోవడం సరైన నిర్ణయం కాదు. అయితే ఉత్పల్ కు మరో రెండు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చాం, ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయి. 






ఉత్పల్ తో టచ్ లో ఉన్నాం


బీజేపీ నేతలు ఉత్పల్ పారికర్‌తో టచ్‌లో ఉన్నారని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మనోహర్‌ పారికర్‌ సీఎంగా ఉన్నప్పుడు భిన్నమైన మాటలు మాట్లాడారని, ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం రకరకాలుగా చెబుతున్నారన్నారు. గోవా ప్రజలు దీన్ని అర్థం చేసుకుని మళ్లీ బీజేపీ ప్రభుత్వానికి పట్టం కడతారన్నారు.  


Also Read: యూపీలో భాజపా దెబ్బకు దెబ్బ.. నిన్న కోడలు, నేడు తోడల్లుడు.. ఎస్పీకి వరుస షాక్‌లు!


ఉత్పల్ కు కేజ్రివాల్ ఆఫర్ 


దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడికి దిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారు. తమ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవాలని ఉత్పల్ పారికర్‌ను కోరారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేసిన పనాజీ స్థానం టికెట్‌ ఇవ్వాలని ఉత్పల్ కోరగా భాజపా నిరాకరించింది. గురువారం మొత్తం 40 సీట్లకు గాను 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన భాజపా.. ఉత్పల్​కు టికెట్​ ఇవ్వలేదు. దీంతో కేజ్రీవాల్.. ఉత్పల్‌ను తమ పార్టీలో చేరాలని ట్వీట్ చేశారు. పనాజీలో స్వతంత్ర అభ్యర్థిగా ఉత్పల్ పారికర్ పోటీ చేస్తే మద్దతు ఇస్తామని శివసేన ఇటీవల పేర్కొంది. అయితే, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటంపై ఇప్పటి వరకు ఉత్పల్ పారికర్ స్పందించలేదు.


రెండో జాబితాలో..


ఇంకా భాజపా ఆరు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. మిగిలిన స్థానాల్లో ఉత్పల్‌ పారికర్​కు పోటీ చేసే అవకాశం భాజపా ఇవ్వొచ్చు. కానీ తన తండ్రి పోటీ చేసిన పనాజీ స్థానంలోనే బరిలోకి దిగాలని ఉత్పల్ భావిస్తే.. కేజ్రీవాల్ ఆఫర్ స్వీకరిస్తారో లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగగుతారో చూడాలి. గోవా అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.


Also Read: జూనియర్ పారికర్‌కు భాజపా షాక్.. కేజ్రీవాల్ ఓపెన్ ఆఫర్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి