ఉత్తర్‌ప్రదేశ్‌లో పోటీచేసే తమ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 41 మంది అభ్యర్థుల జాబితాలో 16 మంది మహిళలు ఉన్నారు. గత వారం ప్రకటించిన 125 మంది అభ్యర్థుల్లో 50 మంది మహిళలే ఉండటం విశేషం. ఈసారి మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ 40 శాతం సీట్లను స్త్రీలకే కేటాయిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
అభ్యర్థుల జాబితా ఇదే..
మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్.. రాష్ట్రంలో భారీ ర్యాలీలను చేస్తోంది. 'లడికీ హూ.. లడ్ సక్తి హూ' పేరుతో ప్రియాంక గాంధీ నాయకత్వంలో ఈ ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఎన్నికల సంఘం.. ర్యాలీలను నిషేధించడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గింది.
తొలి జాబితాలో..
తొలి జాబితాగా 125 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కాంగ్రెస్. 125 మందిలో 50 మంది మహిళలు ఉన్నారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా దేవికి కూడా కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది.
సోన్‌బాద్రా ఘటనపై గళమెత్తిన నాయకుడికి ఉంబా నియోజకవర్గం టికెట్ ఇచ్చింది. షాజాన్‌పుర్ స్థానంలో ఆశా వర్కర్ పూనమ్ పాండేకు అవకాశం ఇచ్చింది. ఎన్ఆర్‌సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లిన పార్టీ నేత సదాఫ్ జాఫర్‌కు లఖ్‌నవూ సెంట్రల్ టికెట్ ఇచ్చారు.
కాంగ్రెస్ హామీలు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆశావర్కర్లకు నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని వాగ్దానం.
- రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ.
- గోధమ, వరి పంటలు క్వింటాల్‌కు రూ. 2,500, క్వింటాల్ చెరకును రూ. 400ల చొప్పున కొనుగోలు చేస్తామని ప్రకటన.
- ప్రజలందరికీ రూ. 10 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామని హామీ.
- విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ స్కూటీలు అందజేస్తామని వాగ్దానం