ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ వలసలు పెరుగుతున్నాయి. ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ భాజపాలో బుధవారం చేరగా తాజాగా ఆయన తోడల్లుడు ప్రమోద్ గుప్తా కాషాయ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేశ్ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు.
రానున్న రోజుల్లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరనున్నట్లు ప్రమోద్ గుప్తా అన్నారు. భాజపా అధిష్ఠానం పచ్చజెండా ఊపిన వెంటనే పార్టీలో చేరతారని వెల్లడించారు.
ములాయం భార్య సాధనా గుప్తా సోదరి భర్తే ప్రమోద్ గుప్తా. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అఖిలేశ్‌కు, ఆయన బాబాయి శివపాల్ యాదవ్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. శివపాల్.. సమాజ్‌వాదీ నుంచి బయటికి వచ్చి ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (పీఎస్పీ) పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఆ సమయంలో ప్రమోద్ గుప్తా కూడా పీఎస్పీలో చేరారు.
అయితే తాజా ఎన్నికల్లో శివపాల్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ ఒక్కటవ్వడం నచ్చక ప్రమోద్ గుప్తా భాజపాలో చేరారు.
కాంగ్రెస్ నేత ప్రియాంక మౌర్య కూడా ఈరోజు భాజపాలో చేరారు.
అపర్ణా యాదవ్..
ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణా దేవి.. భాజపాలో బుధవారం చేరారు. పైగా ములాయం సింగ్ ఆశిర్వాదంతోనే తాను భాజపాలో చేరినట్లు అపర్ణా దేవి.. ఏబీపీ న్యూస్‌కు ఇచ్చి ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ములాయం సింగ్ రెండో భార్యకు పుట్టిన ప్రతీక్ యాదవ్‌ను అపర్ణ వివాహం చేసుకున్నారు. 2017 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేశారు. భాజపా అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు. అపర్ణ భాజపాలో చేరుతారని ముందు నుంచీ ఊహాగానాలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ ఇప్పుడు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ పోటీ చేయరని సమాచారం. భాజపా మహిళా మోర్చా బాధ్యతలు ఆమెకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు