ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు కోర్టులో చుక్కెదురైంది. ఆయన కోడలు వేసిన పిటిషన్ విషయంలోనే విజయవాడలోని ఒకటో అదనపు చీఫ్ మెట్రో పాలిటన్ కోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోడల్ని వేధించినందుకు గానూ గృహహింస కేసులో రూ.కోటి చెల్లించాలని న్యాయమూర్తి టాటా వెంకట శివ సూర్య ప్రకాష్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కన్నా లక్ష్మీ నారాయణ - విజయలక్ష్మీ కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మీ కీర్తి గతంలో గృహహింస కేసు పెట్టారు.


కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు కన్నా నాగరాజు, శ్రీలక్ష్మీ కీర్తి 2006 మే 10న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2013లో ఓ కుమార్తె జన్మించింది. కొద్ది కాలం క్రితం శ్రీలక్ష్మీ కీర్తి అత్తామామలు, భర్తపై గృహహింస కేసు పెట్టారు. పెళ్లైన ఏడాది 2006 నుంచి 2015 వరకు గుంటూరులోని కన్నావారితోట వద్ద అత్తమామలతో కలసి ఉన్నామని చెప్పారు. అప్పటిదాకా సంసారం సవ్యంగా సాగిందని బాధితురాలు పేర్కొన్నారు. తమ పెళ్లి జరిగినప్పటి నుంచి అత్త విజయలక్ష్మీ సూటిపోటి మాటలతో తరచూ తనను వేధించేవారని పేర్కొన్నారు. తమ తల్లిదండ్రులు చూడడానికి వచ్చినా ఇంట్లోకి రానివ్వలేదని అన్నారు. వేరొకరిని పెళ్లి చేసుకొని ఉంటే ఎన్నో కోట్ల రూపాయలు కలిసి వచ్చి ఉండేవని అన్నారు. 


అనంతరం భర్త నాగరాజు కూడా పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను వేధించాడని ఆరోపించారు. ఆ విషయం అడిగినందుకు 2015 మార్చి 29న తనను తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి తనను దూరం పెట్టారని బాధితురాలు శ్రీలక్ష్మీ కీర్తి తన ఫిర్యాదులో వివరించారు. తనకు, తన కూతురికి రక్షణ కల్పించాలని, వారి నుంచి నివాస సదుపాయం కల్పించాలని, మెడికల్ ఖర్చులను ఇప్పించాలని కోరారు. దీనికి సంబంధించి గృహహింస చట్టం ప్రకారం కోర్టులో కన్నా నాగరాజు, కన్నా లక్ష్మీనారాయణ, కన్నా విజయలక్ష్మీలను ప్రతివాదులుగా చూపిస్తూ ఆమె పిటిషన్ వేశారు.


మూడు నెలల్లోపు ఇవ్వకపోతే 12 శాతం వడ్డీ
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్‌ అయిన శ్రీలక్ష్మీ కీర్తికి.. అత్తామామలు కన్నా నాగరాజు, లక్ష్మీనారాయణ, విజయలక్ష్మీల నుంచి రక్షణ కల్పిస్తామని తీర్పు ఇచ్చింది. ఆమె నివసించే పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఆర్డర్‌ కాపీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. పిటిషనర్‌కు, ఆమె కుమార్తెకు ప్రతివాదుల ఇంట్లో నివాస వసతి కల్పించాలని, లేకపోతే మరోచోట ఉండేందుకు వసతి కోసం నెలకు రూ.50 వేలు చెల్లించాలని ఆదేశించారు. కూతురి మెడికల్ ఖర్చుల కోసం రూ.50 వేలు చెల్లించాలని, ముగ్గురు ప్రతివాదులు బాధితులకు నష్ట పరిహారం కింద రూ.కోటి ఇవ్వాలని ఆదేశించారు. ఇవన్నీ మూడు నెలల్లోపు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లేకపోతే 12 శాతం వడ్డీతో డబ్బు చెల్లించాలని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు.


Also Read: Cocktail Injection: అప్పుడు రెమిడిసివిర్, ఇప్పుడు కాక్‌టైల్.. కరోనా సోకితే ఇది తప్పకుండా వాడాలా? క్లారిటీ ఇచ్చిన డాక్టర్