వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్‌గా సొంత ఫోటోలు, భార్యతో దిగిన చిత్రాలు పెట్టుకోవడం సహజం. అలా పెట్టుకున్నందుకు ఓ వ్యక్తి మాత్రం చిక్కుల్లో పడ్డాడు. అందులోంచి బయటపడేందుకు ఏకంగా లక్షకు పైగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో ఈ ఘటన జరిగింది. సైబర్ క్రైం పోలీసులు ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యతో దిగిన ఫొటోను వాట్సాప్‌‌లో డీపీగా పెట్టుకొన్నాడు ఓ వ్యక్తి. ఆ ఫొటోను డౌన్‌లోడ్‌ చేసిన కొందరు సైబర్‌ నేరగాళ్లు.. అందులోని సదరు వ్యక్తి భార్య ఫొటోను ఫోటో షాప్ ద్వారా మార్ఫింగ్‌ చేశారు. ఆమె చిత్రాన్ని నగ్న ఫొటోలాగా మార్పులు చేర్పులు చేసి.. ఆమె భర్తకే పంపి బ్లాక్‌ మెయిల్‌కు దిగారు. అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే తన కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లందరికీ ఫొటోలు ఫార్వర్డ్‌ చేస్తానని దుండగుడు బెదిరించాడు. 


ఆ బెదిరింపులకు కంగుతిన్న భర్త ఆ ఫొటోలు పంపవద్దని ప్రాదేయపడ్డాడు. అయితే, అందుకు బదులుగా రెండు దఫాలుగా రూ.1.2 లక్షలు వాళ్లు చెప్పిన ఖాతాకు పంపాడు. ఇంకా డబ్బు డిమాండ్‌ చేయటంతో చిలకలగూడకు చెందిన బాధితుడు సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరిపిన పోలీసులు ఇదంతా తెలిసినవాళ్ల పనే అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికల నుంచి ప్రొఫైల్‌ ఫొటోలు మహిళల ఫొటోలు పెట్టకపోవటం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. తెలియని వారితో చాటింగ్‌లు, ఫోన్లో మాట్లాడటం చేయవద్దని, అనుమానిత నంబర్లను బ్లాక్‌ చేయడం ఉత్తమమని సైబర్‌ క్రైమ్స్‌ పోలీసులు సూచించారు.


అయితే, ఈ ఏడాది 3 వేలకు పైగా సైబర్ క్రైమ్ కేసులు ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే నమోదైనట్టుగా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరించారు. గతేడాదితో పోల్చితే రెండింతలు సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని అన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించి వార్షిక నేర నివేదికను స్టీఫెన్ రవీంద్ర సోమవారం విడుదల చేశారు. ఆ సందర్భంగా సైబర్ నేరాల గురించి చెప్పారు.


Also Read: Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్‌కు నోటీసులిచ్చాం, అయినా.. సైబరాబాద్ కమిషనర్ వెల్లడి


Also Read: Current Charges: తెలంగాణలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు... ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపిన డిస్కామ్స్ 


Also Read: సినిమా టికెట్ల విక్రయాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఐఆర్సీటీసీ తరహాలో ఏపీఎఫ్‌డీసీకు బాధ్యతలు అప్పగింత


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి