చలికాలంలో సాయంత్రం వేడివేడి స్నాక్స్ తినేందుకు అందరూ ఇష్టపడతారు. ఓ రోజు పకోడి, మరో రోజు సమోసా, ఇంకో రోజు ఉడకబెట్టిన పల్లీలు (వేరుశెనగపలుకులు), లేదా పల్లీల పకోడి. కానీ మధుమేహం ఉన్న వారు మాత్రం పల్లీలు తినేందుకు వెనక్కి జంకుతారు. అవి తినకూడని ఆహార జాబితాలో కలిపేస్తారు. నిజానికి డయాబెటిక్ రోగులు కూడా పల్లీలు తినొచ్చు. అతిగా తింటే ఎవరికైనా కడుపునొప్పిలాంటివి కలగవచ్చు. మితంగా తిన్నంత వరకు ఎలాంటి సమస్యా రాదు.
నట్స్ అనగానే గుర్తొచ్చేవి బాదం, వాల్‌నట్స్, జీడిపప్పులాంటివే. కానీ పల్లీలు కూడా నట్స్ కోవలోకే వస్తాయి. నిజానికి బాదం, వాల్‌నట్స్ కన్నా కూడా పల్లీల వల్లే ఆరోగ్యం ఎక్కువ. వీటి వల్ల గుండెకు జరిగే మేలు ఎక్కువే. గుండెపోటు వచ్చే అవకాశాల్ని ఇవి తగ్గిస్తాయి. వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అంతేకాదు రక్తంలో గడ్డలు ఏర్పడకుండా అడ్డుకుంటుంది.
బరువు పెరగరు
పల్లీలు తినడం వల్ల కేలరీలు అధికంగానే శరీరానికి అందుతాయి. అలాగే కొవ్వు కూడా ఉంటుంది. కానీ బరువు పెరగరు. అదే వీటి ప్రత్యేకత. రోజూ పల్లీలు తినేవారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువని చెబుతున్నాయి అధ్యయనాలు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల శరీరానికి రక్షణ కల్పించినట్టు అవుతుంది. పల్లీలలో మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నిషియం, కాపర్, నియాసిన్ వంటి పోషకాలు ఉంటాయి.
మధుమేహులు తినొచ్చు
వేరుశెనగ పలుకుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటుంది. దీనివల్ల డయాబెటిక్ రోగులు తినొచ్చు. వీటిని తినడం వల్ల రక్తం లోని చక్కెర స్థాయులు హఠాత్తుగా పెరగవు. కాబట్టి తిన్నా ఎలాంటి ప్రమాదం లేదు. అంతేకాదు పల్లీలు తినే మహిళలు టైప్ 2 డయాబెటిస్ బారిన తక్కువగా పడతారని కొన్ని అధ్యయనాలు తెలియజేశాయి. కాబట్టి ఎలాంటి భయం లేకుండా పల్లీలను లాగించవచ్చు.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.