హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2021 ఏడాదిలో నేరాలు, రికవరీ ఇతర వివరాలను సీపీ అంజనీకుమార్ మీడియాకు వెల్లడించారు. 2021 ఏడాదిలో జరిగిన వివిధ నేరాల్లో 48 శాతం మంది నేరస్థులకు శిక్షపడిందని తెలిపారు. హైదరాబాద్ 70 వేలకు పైగా నూతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో 4.4 లక్షల సీసీ కెమెరాలు ఉన్నట్లు ప్రకటించారు. 2021లో వివిధ ఘటనల్లో 85 మంది బాధితులు హత్యకు గురైనట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. 192 కిడ్నాప్ కేసులు నమోదవ్వడంతో పాటు, రూ.21 కోట్ల విలువైన సొత్తు అపహరణకు గురైందన్నారు. అందులో రూ.11 కోట్ల సొత్తును రికవరీ చేసినట్లు తెలిపారు.
డ్రగ్స్ కేసులు
హైదరాబాద్ లో డ్రగ్స్ సంబంధించిన వివరాలను వెల్లడించిన సీపీ.. గంజాయి వంటి మాదకద్రవ్యాలను కట్టడి చేసేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించామన్నారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాపై చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది 246 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, 600 మందికి పైగా డ్రగ్స్ సేవించిన నేరస్థులను అరెస్ట్ చేశామన్నారు. స్పెషల్ డ్రైవ్ లో 2077 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మహిళల భద్రతకు నగరంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్న సీపీ అంజనీ కుమార్.. హైదరాబాద్ ఈ ఏడాది ఏడు ఘటనల్లో గుర్తుతెలియని వ్యక్తులు మహిళలపై అఘాయిత్యాలు జరిగాయని తెలిపారు. 228 రేప్ కేసుల్లో మైనర్లు బాధితులుగా ఉన్నారని ప్రకటించారు. 2021 ఏడాదిలో 205 మంది నేరస్థులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు.
Also Read: పీయూష్ గోయల్ వ్యాఖ్యలు దుర్మార్గం, క్షమాపణ చెప్పాల్సిందే.. మంత్రి హరీశ్ డిమాండ్
డ్రంకన్ డ్రైవ్... రూ. 10.49 కోట్ల ఫైన్
ఈ ఏడాది హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిన వారిపై మొత్తంగా 58 లక్షల కేసులు నమోదైనట్లు సీపీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు భారీగా పెరిగినట్లు సీపీ అంజనీకుమార్ ప్రకటించారు. 25,453 మందిపై 2021 లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా, 10,109 మందిపై ఛార్జ్ షీట్ ధాఖలు చేశామన్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులో 206 మందికి జైలు శిక్ష విధించినట్లు సీపీ తెలిపారు. ఒక్క డ్రంకన్ డ్రైవ్ కారణంగా పది కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు ఫైన్ రూపంలో వసూలు చేశామన్నారు. డ్రంకన్ డ్రైవ్ తోపాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఇరవై ఐదు మందికి డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు చేశామన్నారు. నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 1961 రోడ్డు ప్రమాదాలు జరగగా, ఈ ప్రమాదాల్లో 287 మంది మృతి చెందగా వీరిలో 88 పాదచారులు ఉన్నారని, ఏడాది మొత్తంగా పలు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య 2060గా నమోదు అయ్యిందన్నారు. అంతేకాకుండా హెల్మ్ ట్ లేకుండా వాహనాలు నడిపినందుకు 53 లక్షల మంది, ట్రిపుల్ రైడింగ్ కు పాల్పడినందుకు ఒక లక్షా పదహారు వేల మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బైక్ రేసింగ్, ఓవర్ స్పీడింగ్ క పాల్పడిన 90 వేల మందిపై కేసులు నమోదు చేశామన్నారు.
Also Read: హైదరాబాద్ పేరు మార్పు అంశం మరోసారి తెరపైకి.. హాట్ టాపిక్‌గా ఆ ట్వీట్..!
సైబర్ నేరాలు
ఇకపోతే నగరంలో సైబర్ నేరాలు పెరిగినట్లు సీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. ఈ ఏడాది ప్రతీ పోలీస్ స్టేషన్ లో సైబర్ క్రైమ్ ఫిర్యాదు తీసుకున్నామని, మొత్తంగా ఏడాదిలో 1206 బ్యాంక్ అకౌంట్ లలో ఉన్న రూ.80.54 కోట్ల నగదు సీసీఎస్ పోలీసులు ప్రీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన 265 మంది నేరస్థులను అరెస్ట్ చేశామన్నారు. కోట్లాది రూపాయల సైబర్ మోసాలకు పాల్పడిన విదేశీయులు 13 మందిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ ఏడాది మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిపై మొత్తంగా 1414 కేసులు షీ టీమ్స్ నమోదు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ప్రకటించారు.
Also Read: కో అంటే కోట్లు.. కోకాపేట భూముల వేలానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!