దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషులకు గుజరాత్ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. 49 మంది దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంతమందికి ఒకేసారి మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి. మరో 11 మందికి జీవితఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో మొత్తం 77 మందిని విచారించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కేసు విచారణ ముగిసింది. అయితే పలు వాయిదాల తర్వాత ఇటీవల కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్షను ఈరోజు ఖరారు చేసింది.
వరుస పేలుళ్లు
2008లో ఉగ్రవాదులు అహ్మదాబాద్‌లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. జులై 26న గంట వ్యవధిలోనే అహ్మదాబాద్ నగరంలో సుమారు 21 చోట్ల వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో సుమారు 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)కి చెందిన ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)తో సంబంధమున్న మూకలే ఈ బాంబు దాడులకు పాల్పడ్డాయని దర్యాప్తు వర్గాలు తేల్చాయి.