రెండేళ్లకోసారి మాఘశుద్ధ పూర్ణిమ రోజు ఆరంభమైన మేడారం జాతర నాలుగురోజుల పాటు జరుగుతుంది. గిరిజనేతరులకు మూడురోజుల వేడుకే అయినా అడవిబిడ్డలకు మాత్రం ఇది నెల రోజుల పండుగ. ఇక ఏజాతర అయినా ఏటా జరుగుతుంటుంది...మరి మేడారం మాత్రం రెండేళ్లకోసారి ఎందకంటారా..దానికీ ఓ కారణం ఉంది.  కొన్ని గిరిజన తెగలు 60 రోజులను నెలగా పరిగణిస్తారు. ఈ కారణంగానే జాతర రెండేళ్లకోసారి జరుగుతుందంటారు. దాదాపు ఎనిమిది శతాబ్దాలుగా గిరిజనులు, గిరిజనేతరులతో పూజలందుకుంటున్న సమ్మక్క, సారలమ్మలు  కేవలం  ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయినవారు కాదు. తెలుగు రాష్ట్రాలతో పాటూ ఒడిశా, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కోట్ల మంది భక్తులకు సమ్మక్క, సారలమ్మలు ఇలవేల్పులు.


Also Read: ఆ ప్రదేశంలో చిన్న తప్పు చేసినా తేనెటీగలు వెంటాడుతాయట
నాలుగు రోజుల జాతరలో ఏ రోజు ఏం జరుగుతుంది
మొదటి రోజు
రెండేళ్లకోసారి జరిగే జాతరలో భాగంగా ఈనెల 16 నుంచి 19 వరకూ నాలుగు రోజుల పాటు జరుగుతుంది. మొదటి రోజు సాయంత్రం కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు.


రెండో రోజు
రెండో రోజు 17 వ తేదీ సాయంత్రం చిలకల గుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టిస్తారు. అప్పటి నుంచి మొక్కులు చెల్లించుకోవడం ప్రారంభమవుతుంది.


మూడో రోజు
మూడో రోజు 18 వ తేదీన గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.


నాలుగో రోజు
నాలుగో రోజు ఫిబ్రవరి 19 సాయంత్రం అమ్మవారి వన ప్రవేశం జరుగుతుంది.


జాతర జరిగే మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు వచ్చే పౌర్ణమి రోజున గిరిజను పూజారులు మండమెలిగే పండుగను నిర్వహిస్తారు. దీన్ని గిరిజనులు మాత్రమే జరుపుకుంటారు. ఇది జరిగినప్పటి నుంచీ ఆదివాసీలకు జాతర ప్రారంభమైనట్టే. మేడారం జాతరకు ఏటా భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడాల్సి వస్తుందన్న భయంతో నెల రోజుల ముందునుంచే మేడారం వచ్చి దర్శించుకోవడం మొదలైంది. 


Also Read: భక్తులు నేరుగా దర్శించుకునే సమ్మక్క, సారలమ్మ గద్దెలు కాలక్రమేణా ఎన్ని మార్పులు చెందాయో తెలుసా
జాతరకు వచ్చే భక్తులు మొదట జంపన్నవాగులో స్నానం చేసి గద్దెల వద్దకు చేరుకుంటారు. దేవతల కుంకుమ భరిణెలు తీసుకొచ్చే పూజారులకు ఎదురేగే మహిళాభక్తులు పారవశ్యంతో ఊగిపోతుంటారు. దేవతలు గద్దెకు చేరుకునే దారిలో భక్తులు అడ్డంగా పడుకుంటారు. కుంకుమభరిణెలు తీసుకొచ్చే పూజారులు తమపైనుంచి నడుచుకుంటూ వెళితే జన్మ సార్థకం అయినట్టే భావిస్తారు. దేవతలకు ఎదురేగి కోళ్లను ఎగరేయడం, అవి కిందపడకముందే ఒక్క వేటుకు తలనరికే విధంగా బలివ్వడం ఇక్కడ ఆచారం. దీన్నే ఎదురుకోళ్లు అంటారు. ఈ వేడుక చూసేందుకు భక్తులు భారీగా బారులు తీరుతారు. 


గట్టమ్మ తల్లి దర్శన తర్వాతే: మేడారం జాతరకు వెళ్లే భక్తులు మొదట గట్టమ్మ తల్లిని దర్శించుకోవాల్సిందే. లేకపోతే తిప్పల తప్పవని భావిస్తారు. వరంగల్ నుంచి మేడారం దారిలో ములుగు పట్టణానికి వెళ్లే ముందు రోడ్ పక్కనే గట్టమ్మగుడి ఉంటుంది. అందుకే మేడారం జాతర ప్రారంభానికి ముందు అధికారులు కూడా ముందుగా గట్టమ్మకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.