కర్ణాటక(Karnataka)లో హిజాబ్ వివాదం(Hijab Issue) ఇంకా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మైనారిటీ విద్యా సంస్థల(Minority Educational institutions)లో తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు హిజాబ్ ధరించడం అనుమతించవద్దని కర్ణాటక ప్రభుత్వం(Karnataka Govt) గురువారం ఒక సర్క్యులర్‌(Circular)ను జారీ చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ, మౌలానా ఆజాద్ మోడల్ స్కూల్స్ (ఇంగ్లీష్ మీడియం) ఆధ్వర్యంలో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల(Residential Schools)కు కూడా హైకోర్టు(High Court) ఫుల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని మైనారిటీ సంక్షేమం, హజ్ వక్ఫ్ శాఖ కార్యదర్శి మేజర్ పి. మణివణ్ణన్ తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని విద్యాసంస్థలు తరగతి గదుల్లో హిజాబ్, సెఫ్రాన్ కండువాలు, స్కాఫ్స్ర్, ఇతర మత చిహ్నాలను అనుమతించరాదని ఆదేశించారు.






"విద్యా సంస్థలను తిరిగి తెరిచి, విద్యార్థులను త్వరగా తరగతులకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ పిటిషన్‌లన్నింటినీ పెండింగ్‌లో ఉంచుతూ, వారి మతంతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ తదుపరి ఆదేశాల వచ్చే వరకు తరగతి గదిలో హిజాబ్, మతపర కండువాలు(Saffron Shawls), మతపరమైన జెండాలు ఇలాంటివి ధరించకుండా చూడాలి." అని సర్క్యులర్ లో మైనారిటీ వెల్ఫేర్ శాఖ వెల్లడించింది.  కాలేజీ డెవలప్‌మెంట్ కమిటీలు విద్యార్థి దుస్తులను, యూనిఫామ్‌ను నిర్దేశించిన సంస్థలకు మాత్రమే ఈ ఉత్తర్వులు పరిమితమైందని సర్క్యులర్ ప్రకటించింది. హిజాబ్ ధరించిన విద్యార్థులు ఇప్పటికే అధికారులను ప్రశ్నించడం నిరసనలు చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సంబంధిత డిప్యూటీ కమిషనర్లకు మెమోరాండంలు సమర్పించడం ప్రారంభించారు. 


హిజాబ్ వివాదం


కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్‌ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడంపై గత నెలరోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. నెల రోజుల నుంచి ఉడుపి, చిక్‌మంగళూరులో వాతావరణం ఆందోళనగా ఉంది. హిజాబ్స్‌ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోవడంతో ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు. మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్‌' నినాదాలతో ర్యాలీలు చేశారు. ప్రస్తుతం ఈ వివాదం దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.