కరోనా మహమ్మారి విలయానికి చితికిపోయిన రంగాల్లో బంగారం, నగల తయారీ పరిశ్రమ ఒకటి! మొదట్లో బాగా నష్టపోయిన ఈ పరిశ్రమ గతేడాది నుంచి కోలుకుంటోంది. చివరి దీపావళికి టన్నుల కొద్దీ బంగార౦ అమ్ముడుపోయింది. మళ్లీ ఇప్పుడు ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్నాయి. జ్యువెలరీ రంగం వృద్ధి చెందాలంటే తమకూ కొన్ని మినహాయింపులు, రాయితీలు కల్పించాలని జెమ్‌ అండ్‌ జ్యువెలరీ డొమొస్టిక్‌ కౌన్సిల్‌ (GJC) ప్రభుత్వాన్ని కోరుతోంది.



* రానున్న బడ్జెట్‌లో నగలపై జీఎస్‌టీని ఇప్పుడున్న 3 నుంచి 1.5 శాతానికి తగ్గించాలని నిర్మలా సీతారామన్‌ను జీజేసీ కోరుతోంది.



* గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా మంది పాన్‌ కార్డులు లేవు. అత్యవసరంగా బంగారం కొనుగోలు చేయాలంటే ఇబ్బంది కలుగుతోంది. అందుకే పాన్‌ కార్డు లిమిట్‌ను రూ.2 నుంచి 5 లక్షలకు పెంచాలి.


* కరోనా లాక్‌డౌన్‌ల వల్ల వ్యాపారం నష్టపోయింది. ప్రజలు నగలు  కొనుగోలు చేయకపోవడంతో ఎంఎస్‌ఎంఈ జ్యుయెలర్స్‌, స్వర్ణకారులు, కళాకారులు, ఉద్యోగులకు ఉపాధి దొరకడం లేదు. అందుకే పన్నుల పరంగా మినహాయింపులు ఇవ్వాలి.


* గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకం (GMC) కింద వ్యక్తులు కనీసం ఎంత పరిమాణంలో బంగారం దాచుకోవచ్చో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.


* 22 క్యారెట్ల బంగారు నగలపై ఈఎంఐ సౌకర్యానికి అనుమతి ఇవ్వాలి. దాంతో వజ్రాలు, నగల పరిశ్రమ వృద్ధి జోరందుకుంటుంది.


* ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 40Aలో మార్పులు చేయాలి. రోజుకు రూ.10వేలుగా ఉన్న నగదు పరిమితిని రూ.1 లక్షకు పెంచాలి.


* క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసే బంగారు నగలపై ఇప్పుడున్న 1-1.5 బ్యాంకు కమిషన్‌ను పూర్తిగా రద్దు చేయాలి.


* వజ్రాలు, నగల పరిశ్రమకూ మూలధన రాబడిపై పన్ను మినహాయింపును విస్తరించాలి. నగలు అమ్మి కొత్త నగల్లో పెట్టుబడి పెడితే ఆదాయపన్ను చట్టం సెక్షన్‌ 54F ప్రకారం మినహాయింపు ఇవ్వాలి.


* బంగారం, విలువైన లోహాలు, వజ్రాలు, నగలపై పెట్టుబడి రాబడిపై 1.25 శాతం జీఎస్‌టీ విధించాలి. ఇప్పుడు ఇన్‌పుట్‌ క్రెడిట్‌ లేకుండా 1 శాతం, ఇన్‌పుట్‌ క్రెడిట్‌తో 12.5 శాతం ఎక్సైజ్‌ సుంకం, అదనంగా 1 శాతం వ్యా్‌ట్‌ అమలు చేస్తున్నారు. దాంతో స్థానికంగా తయారు చేసే బంగారు ఆభరణాలపై  అదనంగా 1 నుంచి 2 శాతం పన్ను పడుతోంది. దీనికి ఏకరూపత తీసుకొచ్చి జీఎస్‌టీ విధించాలి.


* దేశంలోని ప్రజల వద్ద 23,000-24000 టన్నుల బంగారం ఉందని అంచనా. 2015 నుంచి కేంద్రం గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకం అమలు చేస్తోంది. ఇందులోనే బంగారం దాచుకోవాలని చెబుతోంది. కానీ ఇప్పటి వరకు చేసిన డిపాజిట్‌ 11 టన్నులు మాత్రమే. దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం.


Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!


Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్‌! ఈ సారి పార్ట్‌1, పార్ట్‌2గా విభజన!


Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!


Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్‌ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!