రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను ప్రాసెస్‌ చేసేందుకు ట్రెజరీ ఉద్యోగులు నిరాకరించినట్లు సమాచారం. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు జీవోలు జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం ఈనెల 25 లోగా వేతనాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం ట్రెజరీ అధికారులను ఆదేశించింది. అయితే కొత్త పీఆర్‌సీ ప్రకారం జీతాలను ప్రాసెస్‌ చేసేందుకు ట్రెజరీ అధికారులు, డ్రాయింగ్‌ అధికారులు నిరాకరించారు. తాము కూడా ఉద్యోగుల్లో భాగమేనని అంటున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను చెల్లిస్తూ జీతం పెరిగినట్లు బిల్లులు చేయడానికి ఉద్యోగులు నిరాకరించినట్లు తెలుస్తోంది. 



Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు


ప్రభుత్వం మాత్రం ఇలా...


ఈ నెల నుంచి పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. సవరించిన పే స్కేల్స్‌ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.  కొత్త పీఆర్సీ, తగ్గించిన హెచ్ఆర్ఏ ప్రకారమే వేతన బిల్లులు తయారు చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ట్రెజరీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కొత్త సాఫ్ట్‌వేర్ తయారు చేసి జిల్లాలకు పంపారు. ఈ నెల 25వ తేదీలోపు బిల్లులు పంపాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 23 శాతం ఫిట్‌మెంట్‌తో కోతపెట్టిన హెచ్ఆర్ఏ, కొత్త డీఏలను కలుపుకుని బిల్లుల తయారు చేయనున్నారు. ప్రతి నెల 28వ తేదీ నాటికి బిల్లులు తీసుకునే సర్కార్ ఈసారి 25వ తేదీకే బిల్లులు పంపాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. కొత్త పీఆర్సీ ప్రకారం అన్నింటినీ తగ్గించాల్సి ఉండటం.. డీఏలను కలపాల్సి ఉండటంతో  ఏమైనా సమస్యలు వస్తే మూడు రోజుల్లో పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని ముందుగానే పంపాలని కోరుతున్నట్లుగా భావిస్తున్నారు. 


Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు


ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం కొత్త పీఆర్సీ ప్రకారం తమకు జీతాలు వద్దని.. పాత పీఆర్సీ ప్రకారమే.. పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంగీకరించే ప్రశ్నే లేదంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల అంగీకారంతో సంబంధం లేకుండా పని పూర్తి చేసుకుని వెళ్లిపోతోంది. వాస్తవానికి సీఎం జగన్ పీఆర్సీ ప్రకటించినప్పుడు ఉద్యోగసంఘ నేతలందరూ హాజరయ్యారు. ఆయన ప్రకటన పూర్తయిన తర్వాత అందరూ కొత్త పీఆర్సీకి అంగీకరించారు. అప్పుడు చేసిన ప్రకటననే ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తోంది. సీఎం జగన్ పీఆర్సీ ప్రకటన సమయంలో హెచ్‌ఆర్‌ఏలు.. ఇతర అలవెన్స్‌లు తగ్గిస్తామని నేరుగా చెప్పలేదు. సీఎస్ కమిటీ నివేదికను అమలు చేస్తామని తర్వాత ప్రభుత్వ వర్గాలు ఉద్యోగ సంఘ నేతలకు చెప్పాయి. దీంతో  ఉద్యోగ సంఘ నేతలు భగ్గుమన్నారు. సీఎస్ కమిటీ పూర్తి స్థాయిలో హెచ్‌ఆర్‌ఏ తగ్గింపునకు సిఫార్సు చేయడమే కారణం అయిది. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవని చెబుతున్న ప్రభుత్వం.. జీతాలు ఇవ్వడం ద్వారా ఆ విషయాన్ని చెప్పాలనుకుటున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.