Stock Market Crash: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగడంతో భారత స్టాక్‌ మార్కెట్లు చిగురుటాకులా వణికిపోయాయి. కీలక సూచీలు కనీవినీ ఎరగని స్థాయిలో పతనం అవుతున్నాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఏకంగా 3 శాతం వరకు పతనమయ్యాయి. మార్కెట్లు మొదలైన అరగంటలోనే బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.256 లక్షల కోట్ల నుంచి రూ.246 లక్షల కోట్లకు తగ్గింది.


భయంతో మదుపర్లు షేర్లను తెగనమ్ముతుండటంతో ప్రతి పది కంపెనీల షేర్లలో తొమ్మిది నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇక పది కంపెనీల్లో ఆరు లోయర్‌ సర్క్యూట్‌కు చేరుకున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌కు 102 డాలర్లకు చేరుకుంది. ఇండియా విక్స్‌ 30 శాతానికి పెరిగింది. మార్కెట్లు ఇప్పటికే జీవనకాల గరిష్ఠాల నుంచి పది శాతం వరకు పతనమయ్యాయి.





BSE Sensex 2000 డౌన్‌


క్రితంరోజు 57,232 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,418 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో ఆరంభమైంది. దాదాపుగా 1800 పాయింట్ల నష్టంతో మొదలైంది. చూస్తుండగానే 55,147 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే సూచీ ఏకంగా 2085 పాయింట్లు పతనమైంది. ప్రస్తుతం 1500 పాయింట్ల నష్టంతో 55,740 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.


NSE Nifty 600 డౌన్‌


బుధవారం 17,063 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 16,548 పాయింట్ల వద్ద మొదలైంది. దాదాపుగా 515 పాయింట్ల నష్టంతో ఆరంభమైంది. వెంటనే 16,453 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 610 పాయింట్ల వరకు పతనమైంది. ప్రస్తుతం కోలుకొని 440 పాయింట్ల నష్టంతో 16,620 వద్ద ఉంది.


Bank Nifty 1200 డౌన్‌


బ్యాంకు నిఫ్టీ 36,085 వద్ద మొదలైంది. అన్ని బ్యాంకుల షేర్లు పతనమవ్వడంతో 35,889 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 1208 పాయింట్ల నష్టంతో 36,184 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీలో 48 కంపెనీల షేర్లు నష్టాల్లో ఉండగా 2 లాభాల్లో ఉన్నాయి. హిందాల్కో, ఓఎన్‌జీసీ స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. టాటా మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హీరోమోటో కార్ప్‌, అదానీ పోర్ట్స్‌, టెక్‌ మహీంద్రా 4 శాతానికి పైగా నష్టాల్లో ఉన్నాయి. మార్కెట్లో అన్ని రంగాల సూచీలూ ఎరుపు రంగులోనే ఉన్నాయి. ఆటో, బ్యాంక్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌, ఐటీ, పవర్‌, రియాల్టీ 2-4 శాతం వరకు పతనమయ్యాయి.


Also Read: పుతిన్ ఓ జీనియస్- కానీ నేనుంటే అంత సీను లేదు: ట్రంప్


Also Read: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు, ఎవరైనా జోక్యం చేసుకుంటే ప్రతీకారమే - పుతిన్‌ హెచ్చరిక