రష్యా - ఉక్రెయిన్‌ వివాదంలో అతి పెద్ద పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ ఆపరేషన్‌ చేపట్టినట్లుగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గురువారం ప్రకటించారు. ఉక్రెయిన్ మిలిటీరీ, తమ ఆయుధాలను అప్పగించి తక్షణం లొంగిపోవాలని హెచ్చరించారు. పుతిన్ ఉన్నట్టుండి గురువారం ఆ ఆశ్చర్యకర ప్రకటనను మీడియా ద్వారా ప్రకటించారు. ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ నిర్ణయం తీసుకున్నామని మాస్కోలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ప్రకటించారు. ఉక్రెయిన్‌ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ఆయన సూచించారు. ఈ ఆపరేషన్‌లో జోక్యం చేసుకునేవారిపై ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్‌ సూటిగా హెచ్చరించారు.







ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రష్యా బాంబు దాడులతో కైవ్, ఖార్కివ్ నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లుగా అంతర్జాతీయా కథనాలు రాసింది. తూర్పు ఉక్రెయిన్‌ అంతటా రష్యా బాంబుల దాడిలతో అట్టుడికినట్లుగా పేర్కొంది. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో ప్రత్యేక సైనిక చర్య నిర్వహించడానికి రష్యన్ దళాలకు ఇప్పటికే అధికారం ఇచ్చినట్లుగా వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ నుంచి వస్తున్న బెదిరింపుల వల్లే ఈ చర్య తీసుకున్నామని పుతిన్ ప్రకటించారు.


ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న పుతిన్‌ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. రష్యా దాడులతో ఉక్రెయిన్ తమ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఉక్రెయిన్‌ ప్రభుత్వం రష్యాకు దీటుగా బలగాలు కూడా సిద్ధం చేసుకుంది. రష్యా దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.