ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై దండయాత్రకు పుతిన్ చేపడతోన్న చర్యలను జీనియస్‌గా ట్రంప్ పేర్కొన్నారు. పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా తాను ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావన్నారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పిస్తూ పుతిన్ నిర్ణయం తీసుకోవడంపై ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు.
మరోవైపు రష్యా దూకుడుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఘాటుగా స్పందించారు. ఉక్రెయిన్‌పై రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ దేశంపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించారు.
" ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన చర్యలకు ప్రతిగా నేను ఆ దేశంపై తొలి దశ ఆంక్షలు విధిస్తున్నాను. ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు ఇంకా కొనసాగిస్తే మేం కూడా ఆంక్షలు విస్తరిస్తాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలు.. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయి. అంతర్జాతీయ సమాజానికి రష్యా సరైన వివరణ ఇవ్వాలి. పశ్చిమ దేశాలతో రష్యాకు ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాలను నిలిపివేశాం. రష్యాలోని ప్రముఖులపై కూడా ఆంక్షలు విధిస్తాం. నార్డ్ స్ట్రీమ్ 2 పైపులైన్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేసేందుకు జర్మనీకు సహకరిస్తాం. ఇప్పటినుంచి రష్యా చర్యకు ప్రతి చర్య ఉంటుంది. "