అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహిం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.
అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈడీ ప్రశ్నలకు నవాబ్ మాలిక్ సరిగా స్పందిచలేదని సమాచారం. దీంతో నవాబ్ మాలిక్‌ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం ఈడీ తరలించింది.
కార్యకర్తల ఆందోళన
నవాబ్ మాలిక్‌ను అరెస్ట్ చేస్తున్నారని తెలిసి ఈడీ కార్యాలయం బయటన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరారు. నవాబ్ మాలిక్‌ను తీసుకువెళ్లకుండా అడ్డగించే ప్రయత్నం చేశారు. ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చిన మాలిక్.. కార్యకర్తలకు అభివాదం చేశారు.
ఇదే కేసు
దావూద్, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్ మాలిక్ కొనుగోలు చేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్‌కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశింతంగా పరిశీలిస్తోంది ఈడీ. దావూద్ సోదరుడు ఇబ్రహిం కస్కర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్లు అధికారులు తెలిపారు. ఆ విషయాల ఆధారంగానే నవాబ్ మాలిక్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్లు తెప్పారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొంతకాలం క్రితం ముంబయి, పుణె సహా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది ఈడీ. ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకుంది. అందులో అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పద బ్యాంకింగ్ లావాదేవీల పత్రాలు ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ పత్రాలపైనే మాలిక్‌ను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు.
Also Read: HC on Love Marriage: కులాంతర వివాహం చేసుకుంటే కూతురు కాకుండా పోదు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు