Intelligence chief OF Andhra Pradesh: గ‌త ప్ర‌భుత్వంలో ఆయ‌న ఆఫ్ లైన్... ఇప్పుడు ఆయ‌నే అత్యంత కీల‌కం అయిన అధికారి. రాష్ట్ర స్దాయిలో చ‌క్రం తిప్పేందుకు అవ‌స‌రం అయిన అన్ని మార్గాలు కూడా ఆయ‌న వ‌ద్ద‌కే వ‌స్తాయి. గ‌త ప్ర‌భుత్వంలో అధికార పార్టి ఎమ్మెల్యేను ఢీకొన్న ఆయ‌న ఇప్పుడున్న ప్ర‌భుత్వంలో నిఘా వ‌ర్గానికి బాస్‌గా తెర మీద‌కు వ‌చ్చారు. ఆయ‌న మరెవరో కాదు ఐపీఎస్‌ పి.సీతారామాంజనేయులు.


ఏపీపీఎస్‌సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్‌ అధికారి పి.సీతారామాంజనేయులు (IPS PSR Anjaneyulu)ను ఏపీ ప్ర‌భుత్వం ఆ ప‌ద‌వి నుండి రిలీవ్ చేసింది. అత్యంత కీల‌కం అయిన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఆంజనేయలును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువ‌రించింది. తాజాగా జ‌రిగిన బ‌దిలీల్లో ఇది మ‌రో ఆస‌క్తిక‌ర అంశంగా చెప్పుకోవ‌చ్చు. ఏపీ సీఎం వద్ద అత్యంత న‌మ్మ‌క‌స్తులుగా ఉన్న ప్ర‌వీణ్ ప్ర‌కాష్ బ‌దిలీ తోపాటుగా ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్‌ను కూడా బ‌దిలీ చేయ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ఆ త‌రువాత కొంచెం గ్యాప్ తీసుకుని మ‌రోసారి కొంద‌రు అధికారుల‌ను బ‌దిలీలు చేస్తూ ప్ర‌భుత్వం రెండు వేర్వేరు జీవోలు ఇచ్చింది. ఇంట‌లిజెన్స్ చీఫ్ బాద్య‌త‌లు ఏపీలో అత్యంత కీల‌కం. డీజీపీగా బాధ్యతలు నిర్వ‌ర్తించ‌టం ఒక ఎత్త‌యితే, నిఘా వ‌ర్గాల ద్వారా స‌మాచారాన్ని సేక‌రించ‌టం ప్ర‌భుత్వాన్ని అప్ర‌మ‌త్తం చేయ‌టం, త‌ద్వార అధికార ప‌క్షానికి స‌పోర్ట్ గా నిల‌వ‌టం వంటి అంశాలు ఉంటాయి. 


అటు రాజీయంగా, ఇటు అధికార ప‌క్షంగా క‌త్తిమీద సాములాంటిది. తాజాగా ఏపీలో ఉద్యోగ సంఘాలు త‌ల‌పెట్టిన ఆందోళ‌న‌లు ప్ర‌భుత్వానికి తీవ్ర ఇబ్బందిగా ఉన్నాయి. డీజీపీగా గౌతం స‌వాంగ్ బ‌దిలీకి కూడ ఇదే ప్ర‌ధాన కార‌ణమని ప్ర‌చారం జ‌రిగింది. ఉద్యోగులు త‌ల‌పెట్టిన ఆందోళ‌నలో ఛ‌లో విజ‌య‌వాడ భారీగా స‌క్సెస్ అయ్యింది. ఊహించ‌ని రీతిలో ఉద్యోగులు పోలీసుల నిర్బంధాల‌ను దాటుకొని విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన తీరు ప్ర‌భుత్వాన్ని ఖంగుతినేలా చేసింది. దీంతో ఛ‌లో విజ‌య‌వాడ స‌క్సెస్ త‌రువాత ప్ర‌భుత్వం దిగి రాక త‌ప్ప‌లేదు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి వారిని త‌మ మార్గంలోకి తెచ్చుకునేందుకు ప్ర‌భుత్వ పెద్ద‌లు కంటిపై కునుకు లేకుండా ప‌ని చేయాల్సి వ‌చ్చింది. ఇలాంటి ప‌రిస్దితుల‌ను అంచ‌నా వేసి, ప్ర‌భుత్వాన్ని అల‌ర్ట్ చేయ‌టంతో పాటుగా పార్టికి కూడ స‌హ‌క‌రించాల్సిన బాద్య‌త నిఘా వ‌ర్గాలపై ఉంటుంది. అలాంటి కీల‌క‌మయిన ఇంట‌లిజెన్స్ చీఫ్ బాధ్యత‌ల‌ను పీఎస్ఆర్ ఆంజ‌నేయుల‌కు కేటాయించారు.


గ‌త ప్ర‌భుత్వంలో పీఎస్ఆర్ అత్యంత వివాదాస్ప‌దంగా వ్య‌వ‌హ‌రించారు. ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీతో నేరుగా త‌ల‌ప‌డ్డారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వ‌ల్ల‌భ‌నేని వంశీ, అప్ప‌టి విజ‌య‌వాడ సీపీగా ప‌ని చేస్తున్న పీఎస్ఆర్ ఆంజ‌నేయుల‌కు మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. పీఎస్ఆర్ కు ప్ర‌భుత్వం అధికారికంగా కేటాయించిన సెల్ ఫోన్ నెంబ‌ర్ నుండి వేరొక మ‌హిళ‌తో చ‌నువుగా మాట్లాడ‌టం, ఆ కాల్ రికార్డ్ ల‌ను వంశీ వెలుగులోకి తీసుకురావ‌టం సంచ‌ల‌నంగా మారింది. అయితే వంశీకి, పీఎస్ ఆర్ కు మ‌ధ్య ఎందుకు విభేదాలు వ‌చ్చాయ‌న్న‌ది కూడా చాలా చిన్న విషయం. 


గ‌న్ మెన్ల కేటాయింపుల్లో త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా అప్ప‌టి సీపీగా ఉన్న పీఎస్ఆర్ స‌హ‌క‌రించ‌లేద‌ని వంశీ అసంతృప్తితో ఉన్నారు. అలా మెద‌ల‌యిన వివాదం కాస్త ఇద్ద‌రి మ‌ధ్య చాలా సీరియ‌స్ గామారింది. అధికార పార్టిలో ఎమ్మెల్యేగా ఉన్న వంశీ, విజ‌య‌వాడ సీపీతో త‌ల‌ప‌డ‌టం ఆ త‌రువాత సీపీగా పీఎస్ ఆర్ ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేయ‌టం వంటి వ్య‌వ‌హ‌రాలు సంచ‌ల‌నంగా మారాయి. వంశీని అంతం చేసేందుకు పీఎస్ఆర్ మాజీ న‌క్స‌లైట్ల‌తో ప‌ద‌కం ర‌చించారంటూ వంశీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు ఆరోప‌ణలు సైతం చేశారు. అదే స్దాయిలో పీఎస్ఆర్ ఆంజ‌నేయులు కూడా కౌంట‌ర్ ఇచ్చారు. ఈ విష‌యం అప్ప‌టి ప్ర‌భుత్వానికి ఇర‌కాటంగా మార‌టంతో ఆయ‌న్ను బ‌దిలీ చేయాల్సి వ‌చ్చింది. ఆ త‌రువాత నుండి పీఆఎస్ఆర్ కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్ళిపోయారు. 


ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్ర‌భుత్వం ఏర్పాటు కాగానే ఆయ‌న రాష్ట్ర సర్వీసులు ఏపీకి వ‌చ్చారు. అలా వ‌చ్చిన ఆయ‌న‌కు అప్ప‌టి సీఎస్ సుబ్ర‌హ్మ‌ణ్యం ఆర్టీసీ ఎండీగా బాధ్యత‌లు కూడా అప్ప‌గించారు. ఆలా కంటిన్యూ అవుతున్న పీఎస్ఆర్, తక్కువ సమయంలోనే సీఎం జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహ‌తంగా మారారు. పీఎస్ఆర్ కుమారుడి వివాహ వేడుక‌ల‌కు కూడా సీఎం జ‌గ‌న్ హ‌జ‌ర‌య్యారు. ఇప్పుడు డీజీపీగా బాధ్యత‌లు స్వీక‌రించిన రాజేంద్ర‌నాద్ రెడ్డికి కూడా పీఎస్ఆర్ అత్యంత స‌న్నిహితులు. అన్ని విషయాలు పరిశీలించి ఏపీలో అత్యంత కీల‌కమయిన ఇంట‌ెలిజెన్స్ విభాగానికి పీఎస్ఆర్‌ను చీఫ్‌గా నియ‌మిస్తూ స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
Also Read: AP Shallow Land: ఏపీలో భారీగా పెరుగుతోన్న నిస్సార భూమి, ఇస్రో సర్వేలో ఆసక్తికర విషయాలు! తెలంగాణలోనూ ఎంత పెరిగిందంటే


Also Read: AP IAS IPS Transfers: ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ, ఇంటెలిజెన్స్ న్యూ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు