ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది మంది ఐఏఎస్(IAS), ముగ్గురు ఐపీఎస్(IPS) అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నీరబ్‌కుమార్ ప్రసాద్‌ ను బదిలీ చేసింది. సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌.జవహర్‌రెడ్డిని(KS Jawahar Reddy) నియమించింది. ఆయన తితిదే ఈవోగానూ కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది. సీసీఎల్‌ఏ(CCLA)గా జి.సాయిప్రసాద్‌, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా జి.ఎస్‌.ఆర్‌.కె.ఆర్‌.విజయ్‌కుమార్‌, రవాణాశాఖ కమిషనర్‌గా ఎం.టి.కృష్ణబాబు(Krishna Babu)కు అదనపు బాధ్యతలు అప్పగించింది. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్‌కుమార్‌, క్రీడలు, యువజనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్‌ భార్గవకు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఏపీపీఎస్‌సీ(APPSC) కార్యదర్శిగా ఏ.బాబుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 


ఏసీబీ డీజీగా రాజేంద్రనాథ్ర రెడ్డి 


ముగ్గురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఐపీఎస్‌ అధికారి పి.సీతారామాంజనేయులును ఏపీపీఎస్‌సీ కార్యదర్శి నుంచి ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్(Intelligence Chief)గా పీఎస్ఆర్ ఆంజనేయులను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.  కేవీ రాజేంద్రనాధ్ రెడ్డికి ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. ఏపీ డీజీపీ పూర్తి అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగుతారని ప్రభుత్వం  పేర్కొంది. విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంట్ ఏడీజీగా శంకబ్రతబాగ్చిని నియమించింది.  ఏపీఎస్పీ బెటాలియన్స్ ఏడీజీగానూ ఆయను పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. 


ఇటీవల డీజీపీ బదిలీ 


ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ గౌతం సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. ఆయనకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించింది. గౌతం సవాంగ్ స్థానంలో పూర్తి అదనపు బాధ్యతలను కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ( APPSC Chariman ) పదవి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కావడంతో ఆయన నియామక ఉత్తర్వులను గవర్నర్‌కు పంపినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ ఆమోద ముద్ర పడిన తర్వాత సవాంగ్ పదవీ కాలం ప్రారంభమవుతుంది. ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే డీజీపీగా సవాంగ్‌కు బాధ్యతలు ఇచ్చారు. 


ప్రవీణ్ ప్రకాశ్ బదిలీ


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్ ను ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను ఢిల్లీలో ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్ కమిషనర్‌గా ఆయనను నియమించారు. అవినీతి ఆరోపణలు లేనప్పటికీ వివాదాస్పద నిర్ణయాలతో ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం తెప్పించిన కారణంగానే ఆయన బదిలీ జరిగినట్లు భావిస్తున్నారు. ఇటీవలి సభలో సీఎం జగన్‌ వద్ద మోకాళ్లపై కూర్చుని పతాక శీర్షికలకు ఎక్కడంతో ప్రవీణ్‌ ప్రకాష్‌ పేరు మోగిపోయింది.