ICC Men's T20 World Cup 2022: యూఏఈ, ఐర్లాండ్ మరోసారి అద్భుతం చేశాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2022కు అర్హత సాధించాయి. ఆస్ట్రేలియాలో జరిగే మెగా టోర్నీలో పెద్ద జట్లతో తలపడనున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ అర్హత టోర్నీలో ఈ రెండు జట్లు సెమీ ఫైనళ్లు గెలవడంతో అర్హత పొందాయి.
ఒక సెమీ ఫైనళ్లో యూఏఈ, నేపాల్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్మద్ వసీమ్ (70) మెరుపు అర్ధశతకం బాదేశాడు. మరో ఆటగాడు వృత్యా అరవింద్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. దీపేంద్ర సింగ్ (38), జ్ఞానేంద్ర మల్లా (20) టాప్ స్కోరర్లు. అహ్మద్ రజా 5 వికెట్లు తీశాడు. మ్యాచులో ఘన విజయం సాధించడంతో యూఏఈ టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది.
మరో సెమీస్‌లో ఐర్లాండ్, ఒమన్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. గారెత్ డెలానీ (47), హ్యారీ టెక్టార్ (35), ఆండీ మెక్‌బ్రిన్ (36) అదరగొట్టారు. ఛేదనకు దిగిన ఒమన్ 109 పరుగులకు ఆలౌటైంది. షోయబ్ ఖాన్ (30), జీషన్ మక్సూద్ (28) మాత్రమే పోరాడారు. ఐర్లాండ్‌లో సిమి సింగ్ 3, జోష్ లిటిల్, క్రెయిగ్ యంగ్, ఆండీ మెక్‌బ్రిన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రెండు దశల్లో జరగనుంది. మొదట గ్రూప్-ఏ, గ్రూప్-బి సూపర్ 12 కోసం పోటీ పడతాయి. ఇప్పుడు యూఏఈ, ఐర్లాండ్ అర్హత సాధించింది ఈ గ్రూపుల్లోకే. అర్హత పోటీల్లో సెమీస్‌కు అర్హత సాధించే మరో రెండు జట్లు ఇందులోకి వస్తాయి. మొత్తంగా ఈ రెండు గ్రూపుల్లోని నాలుగు జట్లు సూపర్ 12కు వెళ్తాయి. అప్పుడు అసలు సిసలైన పోటీలు మొదలవుతాయి.