కరోనా అంతమయ్యేది ఎప్పుడు? 
ఇప్పుడు ఎంతో మందిని తొలిచేస్తున్న ప్రశ్న ఇదే. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన రష్యా ప్రతినిధి మెలిటా ఉజ్నోవిక్ సమాధానమిచ్చే ప్రయత్నం చేశారు. తన అంచనా ప్రకారం 2022లోనే కరోనా అంతమవుతుందని, అంతం అనగానే అది పూర్తిగా ప్రపంచం నుంచి తుడిచిపెట్టుకుపోతుందని కాదని తెలిపారు.దాని తీవ్రతను పూర్తిగా తగ్గించుకుని సాధారణ ఆరోగ్యసమస్యలా మారుతుందని వివరించారు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు.


ఒమిక్రాన్ వేరియంట్ తరువాత పెద్దగా ఏ వేరియంట్ కూడా వ్యాప్తి చెందలేదు, ఆ తరువాత వచ్చిన సబ్ వేరియంట్ల ప్రభావం ప్రజలపై అధికంగా లేదు కాబట్టి ఇక కరోనా వైరస్ బలహీనంగా మారినట్టేనని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ఏడాదే కరోనా ముగింపు దశకు చేరుకుంటుందని చెప్పారు. అదే జరిగితే మానవాళి ఓ మహమ్మారి బారి నుంచి బయటపడినట్టేనని అన్నారు.  ‘కేసులు అధికంగా ఉన్నాయి అంటే వేరియంట్ త్వరగా వ్యాప్తి చెందే, పరివర్తన చెందే సామర్థ్యాన్ని కలిగి ఉందని అర్థం. ఒమిక్రాన్ ప్రపంచమంతా ఓసారి వ్యాపించాక దాని జోరు తగ్గింది. ఈ తరువాత మరే వేరియంట్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందలేదు. అందుకే ఇది చివరిదని ఆశిస్తున్నాం’ అని ఆమె అభిప్రాయపడ్డారు. 


చాలా దేశాల్లో ఒమిక్రాన్ ఉప్పెన తగ్గుముఖం పట్టడంతో అన్ని ఆంక్షలను ఎత్తివేశారు. కొన్ని దేశాల్లో స్వల్ప స్థాయిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి.ఇటీవల WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ మాట్లాడుతూ కరోనా వైరస్ పై విజయం సాధించామని ఏ దేశమైనా ప్రకటించుకుంటే అది ముందుగా తొందరపడడమే అవుతుందని, మరికొంతకాలం వేచి చూడాలని అన్నారు. 


ఫైజర్ మాత్రం ఇలా చెప్పింది...
ప్రపంచఆరోగ్య సంస్థ ప్రతినిధులు 2022లో కరోనా అంతమవుతుందని చెబుతుంటే, అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ మాత్రం 2024 వరకు కరోనాను భరించాల్సిందేనని అంది. అయితే రాబోయే కాలంలో ఈ వైరస్ జోరు తగ్గుతుందని, కొన్ని ప్రాంతాల్లోనే దీని ఉనికి ఉండొచ్చని ఫైజర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ మైఖెల్ డోల్ స్టన్ అన్నారు. 2024నాటికి మాత్రం దీని ప్రభావాం పూర్తిగా తగ్గిపోతుందని అంచనా వేశారు. 


ఇది మూడో ఏడాది...
కరోనా ప్రపంచంలోకి ప్రవేశించి ఇది మూడో ఏడాది. రెండేళ్లు గడగడలాడించింది. ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమిక్రాన్ వంటి వేరియంట్లతో విరుచుకుపడి ఎంతో మంది ప్రాణాలు తీసింది. ప్రస్తుతం పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదు. 


Also read: తెల్లదొరల పాలిట సింహస్వప్నం ఉయ్యాలవాడ, ఆ రేనాటి వీరుణ్ని ఉరితీసింది సరిగ్గా ఇదే రోజు


Also read: మళ్లీ బర్డ్ ఫ్లూ కేసులు, చికెన్ తింటే ప్రమాదమా, బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుందా?