Bhudan Pochampally Rape Case: పాతికేళ్ల యువతిపై తాత వయసు ఉన్న ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 65 ఏళ్ల వృద్ధుడు, మానసికంగా సరిగ్గా లేని ఓ దళితిని వంచించాడు. ఏది సరైనదో, ఏది కాదో తెలుసుకోలేని ఆ యువతికి మాయమాటలు చెప్పి శారీరంగా తన కోరికను తీర్చుకున్నాడు. ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చింది. ఈ ఘటన హైదరాబాద్ శివారు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూదాన్ పోచం పల్లి మండలంలోని మెహర్ నగర్‌లో చోటు చేసుకొంది.
పోలీసులు, బాధితురాలు, స్థానికులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. భూదాన్ పోచంపల్లి మండలం మెహర్ నగర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువతికి తల్లిదండ్రులు లేరు. కొన్నేళ్ల క్రితమే మరణించారు. ఆమెకు మతిస్తిమితం సరిగ్గా లేదు. ఈ యువతికి పెళ్లి అయిన ఇద్దరు అక్కలు ఉన్నారు. ఈ యువతి మాత్రం మెహర్ నగర్ గ్రామంలోనే ఒంటరిగా సొంత ఇంట్లోనే ఉంటోంది. ఈ యువతికి అదే గ్రామానికి చెందిన ఉప్పు నూతుల మల్లయ్య అనే 65 ఏళ్ల వృద్ధుడు మాయ మాటలు చెప్పాడు. ఆమె ఇంట్లోకి ప్రవేశించి శారీరంగా లోబర్చుకొన్నాడు. ఈ ఘటన కొన్ని నెలల క్రితమే జరిగింది.
15 రోజుల క్రితం యువతి రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని అనాజ్ పూర్ గ్రామానికి వెళ్లింది. అక్కడే ఉంటున్న తన అక్క వద్దకు వెళ్లింది. యువతి పొట్ట భాగం చూసి వారికి అనుమానం రావడంతో యువతి అక్కాబావ ఆస్పత్రికి తీసుకెళ్లి ఆమెకు మెడికల్ టెస్టులు చేయించారు. ఆ పరీక్షల్లో యువతి 7 నెలల గర్భవతి అని డాక్టర్లు నిర్ధరించారు. దాంతో ఆ యువతిని ఆమె అక్క బావ ప్రశ్నించగా మల్లయ్య అనే వ్యక్తి తనను లోబర్చుకొని మోసం చేశాడని తెలిపింది. విషయం బయటికి పొక్కడంతో సోమవారం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో బాధితురాలికి పరిహారం ఇప్పించి రాజీ కుదిర్చేందుకు యత్నించారు. కానీ, ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదరకపోవడంతో.. సాయంత్రం బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది.
వెంటనే చౌటుప్పల్ రూరల్ పోలీసులు గ్రామాన్ని సందర్శించి స్థానికులను ప్రశ్నించి విచారణ చేపట్టారు. ఉప్పు నూతుల మల్లయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే తనకు ఎలాంటి పాపం తెలియదని, తాను మంచి వాడినని మల్లయ్య చెబుతున్నట్లుగా పోలీసులు తెలిపారు.