మహారాష్ట్రాలోని షాహాపూర్లో ఉన్న ఓ పౌల్ట్రీలో దాదాపు వందకోళ్లు మరణించాయి. అవి ఎందుకు మరణించాయో తెలుసుకునేందుకు యజమని వాటి శాంపిళ్లను పరీక్ష చేయించాడు. అందులో ఆ కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్టు తేలింది.దీంతో ఆ పౌల్ట్రీలో ఉన్న 15,600 కోళ్లను చంపేశారు. బర్డ్ ఫ్లూనే ‘H5N1ఎవియన్ ఫ్లూ’ అని కూడా పిలుస్తారు. మళ్లీ బర్డ్ ఫ్లూ చెలరేగిపోతే పరిస్థితి ఏంటి? చికెన్ తినడం మానేయాలా? బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకే అవకాశం ఉందా? వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
బర్డ్ ఫ్లూ పక్షులలోనే వస్తుందా?
ఎవియన్ ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ పక్షులలో వచ్చే ఇన్ఫెక్షన్. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెప్పిన ప్రకారం ఇది కేవలం కోళ్లలోనే కాదు అన్నిరకాల పక్షుల్లో కలుగుతుంది. నిజానికి అడవి పక్షులు తమ ప్రేగులలో ఈ వైరస్ ను కలిగి ఉంటాయి. కానీ అవి జబ్బు పడవు. వాటి సలైవా, మల విసర్జనలు, నాసిక స్రావాలు వంటి విసర్జితాల వల్ల ఇతర పక్షులకు సోకుతుంది. ముఖ్యంగా ఈ ఫ్లూ సోకిన కోళ్లు, బాతులు, కొన్ని రకాల పెంపుడు పక్షులు మాత్రం అనారోగ్యానికి గురై మరణిస్తాయి.
మనుషులకు సోకుతుందా?
వైద్యులు చెప్పిన ప్రకారం బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకదు. అమెరికాకు చెందిన మాయో క్లినిక్ అధ్యయనం ప్రకారం 2015లో కొన్ని కేసులు నమోదయ్యాయి. కానీ ఆ కేసుల్లోని వ్యక్తులకు స్వల్పపాటి అనారోగ్యం మాత్రమే కలిగింది. 2003 నుంచి 2019వరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ 861 మందికి బర్డ్ ఫ్లూ సోకినట్టు గుర్తించింది. వారిలో 455 మంది మరణించారు.మనిషి నుంచి మనిషికి సోకినట్టు మాత్రం ఇంతవరకు నిర్ధారణ కాలేదు. పక్షులు, కోళ్ల నుంచి మనుషులకు సోకినట్టు గుర్తించారు. అది కూడా అరుదైన సందర్భాలలో మాత్రమే. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులను, కోళ్లను పట్టుకున్నప్పుడు, లేదా వైరస్ కలిగి పక్షుల రెట్టలు చెరువుల్లో కలిసినప్పుడు, ఆ చెరువులో ఈత కొట్టడం ద్వారా కొంతమంది వైరస్ బారిన పడే అవకాశం ఉన్నట్టు గుర్తించారు.
మనుషులకు వస్తే లక్షణాలు ఇలా ఉంటాయి...
బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు వస్తే దగ్గు, జ్వరం, గొంతునొప్పి, కండరాల నొప్పులు, తలనొప్పి, శ్వాసఆడకపోవడం వంటి సమస్యల బారిన పడొచ్చు. అలాగే మరీ సమస్య ముదిరితే శ్వాసకోశ వైఫల్యం, మూత్రపిండాలు పనిచేయకపోవడం, గుండె సమస్యలు రావచ్చు.
చికెన్ తినవచ్చా...
చికెన్ ను శుభ్రంచేసేటప్పుడు చేతికి గ్లవుజులు వేసుకోవాలి. అయితే చికెన్ తినకూడదన్న నియమం లేదు. ఉడికి ఉడకని చికెన్ తింటే సమస్యలు వస్తాయి. దీన్ని అధిక సమయం పాటూ వండితే ఏ వైరస్ అయినా చనిపోతుంది. కాబట్టి బాగా ఉడికించాకే చికెన్ తినాలి.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: కరోనాలాంటి మహమ్మారులు మళ్లీ రాకుండా ఉండాలంటే చెట్లు పెంచాల్సిందే, చెబుతున్న కొత్త అధ్యయనం