Suryakumar Yadav ruled out of T20 Series vs Sri Lanka: శ్రీలంక సిరీసుకు ముందు హిట్‌మ్యాన్‌ సేనకు మరో ఎదురుదెబ్బ! టీమ్ఇండియా (Team India) మిస్టర్‌ 360 డిగ్రీ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) గాయపడ్డాడు. అతడి చేతి ఎముకలో చిన్నపాటి చీలిక రావడంతో సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. లక్నోలో మంగళవారం ప్రాక్టీస్‌ తర్వాత అతడి గాయం తీవ్రత గురించి తెలిసింది.

Continues below advertisement


ఈ మధ్య కాలంలో సూర్యకుమార్‌ యాదవ్‌ చక్కని ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీసులో మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. మూడు మ్యాచుల్లో విజయానికి అవసరమైన పరుగులు చేశాడు. తొలి పోరులో 34 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు రెండో మ్యాచులో 8 పరుగులు చేశాడు. ఇక ఆఖరి మ్యాచులో జట్టు కష్టాల్లో పడ్డప్పుడు నిలబడి 65 పరుగులు దంచేశాడు. అంతకు ముందు అహ్మదాబాద్‌లో విండీస్‌తోనే జరిగిన మూడు వన్డేల్లో వరుసగా 34*, 64, 6 పరుగులు చేశాడు. కేప్‌టౌన్‌ వన్డేలో దక్షిణాఫ్రికా పైనా 39 పరుగులు సాధించాడు.


లక్నోలో మంగళవారం టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ చేసింది. ఆ సమయంలో సూర్యకుమార్‌ యాదవ్‌ సాధన చేయలేదు. రవీంద్ర జడేజాతో మాట్లాడుతూ కనిపించాడు. ప్రాక్టీస్‌ తర్వాత అతడిని వైద్య బృందం పరిశీలించింది. అతడి చేతి ఎముకలో స్వల్ప చీలిక వచ్చిందని తెలిసింది. దాంతో అతడిని సిరీస్‌ నుంచి తప్పించారు. ఇక పేస్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ (Deepak Chahar) సైతం పిక్క కండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు లక్నోకు రాలేదు.


తన ప్రదర్శనతో సూర్యకుమార్‌ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. మిడిలార్డర్‌లో కీలకంగా మారాడు. విండీస్‌ సిరీసులో వెంకటేశ్‌ అయ్యర్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఇప్పుడతని స్థానంలో ఎవరు ఆడతారన్నది ఆసక్తికరం. ఇప్పటికే మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు. ఇప్పుడు చాహర్‌, సూర్య దూరమయ్యారు. అయితే జస్ప్రీత్‌ బుమ్రా జట్టులోకి రావడం కాస్త ఉపశమనం.


టీమ్‌ఇండియా టీ20 జట్టు: రోహిత్‌ శర్మ, రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, వెంకటేశ్ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌, రవి బిష్ణోయ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్, హర్షల్‌ పటేల్‌, జస్ప్రీత్‌ బుమ్రా, అవేశ్‌ ఖాన్‌.