దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనంతగా కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్లలో నమోదు అవుతున్నాయి. వంట నూనెల నుంచి వంట గ్యాస్‌ వరకు, పాద రక్షల నుంచి ఫ్యాషన్‌ దుస్తుల వరకు అనేక కంపెనీలు నమోదు అవుతున్నాయి. గతేడాది చాలా పెద్ద సంస్థలు మార్కెట్లో వచ్చాయి. సూపర్‌ హిట్టయ్యాయి. మరికొన్ని అంచనాలను అందుకోలేకపోయాయి. 2022లోనూ చాలా కంపెనీలు సెబీ వద్ద దరఖాస్తు చేసుకున్నాయి. ఈ సంఖ్య 30కి పైగానే ఉండబోతోంది. చాలామందికి వాటిల్లో పెట్టుబడి పెట్టాలని ఉంటుంది. అలాంటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీ కోసం!!


కంపెనీ వివరాలు ఏంటి?


స్టాక్‌ మార్కెట్లో లేదా ఐపీవోలో పెట్టుబడి పెట్టే ముందూ ఆయా కంపెనీల చరిత్ర తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. ఆ కంపెనీ ఆర్థిక చరిత్ర, వృద్ధి సాధించేందుకు దానికున్న సామర్థ్యం వంటివి తెలుసుకోవాలి. దాని యాజమాన్యం గురించి విచారించాలి. అప్పుడు ఐపీవోకు వస్తున్న కంపెనీలో పెట్టుబడి పెట్టాలో లేదో అవగాహన వస్తుంది.


ముసాయిదా చదవండి


ఒక కంపెనీ ఐపీవోకు వచ్చే ముందు మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వద్ద ముసాయిదా (DHRP) దాఖలు చేస్తాయి. ఇందులో కంపెనీకి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. భవిష్యత్తులో వచ్చే లాభాలు, ఉండే నష్టభయం, పనిచేస్తున్న సెగ్మెంట్లో పోటీ వివరాలు తెలుస్తాయి.


డబ్బుతో ఏం చేస్తోంది?


ఒక కంపెనీ మార్కెట్లోకి నమోదవ్వడం ద్వారా వచ్చే డబ్బులతో అప్పులు తీర్చాలని భావిస్తే అలాంటి ఐపీవోకు దరఖాస్తు చేయకపోవడమే ఉత్తమం. ఒకవేళ అందులో కొంత డబ్బును కార్పొరేట్‌ వ్యవహారాలు, ఇంకా ఎక్కువ నిధులు సేకరించేందుకు, అభివృద్ధి కోసమే అని హామీ ఇస్తే ఇన్వెస్టర్లు ఆలోచించొచ్చు.


కంపెనీ విలువ తెలుసుకోండి


ఐపీవోకు దరఖాస్తు చేసే ముందు సంబంధిత కంపెనీ విలువను గణించడం, తెలుసుకోవడం కీలకం. ఎందుకంటే ఆఫర్‌ చేస్తున్న ధర ఎక్కువ, తక్కువ లేదా సరిగ్గా ఉండొచ్చు. ఇవన్నీ పరిశ్రమలోని ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నేళ్లుగా ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితి, ప్రదర్శన ఎలా ఉందో గమనించాలి. అంతా బాగానే ఉంటే ఐపీవోలో ఇన్వెస్ట్‌ చేయొచ్చు.


ఇన్వెస్టర్‌ ఉద్దేశం ఏంటి?


ఐపీవో నుంచి ఇక ఇన్వెస్టర్‌గా మీరేం కోరుకుంటున్నారు అనేది ముఖ్యం. ఎందుకంటే కొందరు త్వరగా లాభాలను కోరుకుంటారు. మరికొందరు దీర్ఘకాలం పెట్టుబడి కొనసాగిస్తారు. అలాంటప్పుడు మార్కెట్‌ సెంటిమెంటును అనుసరించి ఐపీవోను ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాల లాభాలను ఆశించి కొందరు పెట్టుబడి పెడతారు. కంపెనీ వ్యూహాలను బట్టి ఈ ప్రణాళికలను అమలు చేస్తుంటారు. ఏదో మార్కెట్లో హైప్‌ బాగా వచ్చిందని మీరు ఇన్వెస్ట్‌ చేయొద్దు.


Also Read: Tata Steel Q3 Net Profit: టాటా స్టీల్‌! ఉక్కు కన్నా గట్టిగానే లాభాలు!


Also Read: Tata Nexon EV: అదిరిపోయే కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు.. లాంచ్ త్వరలోనే.. ఒక్కచార్జ్‌తో 500 కిలోమీటర్లు