ఐపీవోకు ముందు భారతీయ జీవిత బీమా (LIC) సంస్థ కస్టమర్లకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. గడువు ముగిసిన, లాప్స్ అయిన పాలసీలను తిరిగి పునరుద్ధరించేందుకు అవకాశం ఇస్తోంది. ఆలస్య రుసుములో రాయితీలను ప్రకటించింది. ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన, ఇంకా టర్మ్ పూర్తవ్వని పాలసీలకు అర్హత ఉంటుందని సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25 వరకు ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తామని వెల్లడించింది.
'ప్రస్తుత కొవిడ్-19 పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ బీమా రక్షణ అవసరం ఎక్కువగా ఉంది. పాలసీలు పునరుద్ధరించేందుకు, జీవితానికి రక్షణ కల్పించేందుకు, కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎల్‌ఐసీ పాలసీదారులకు ఈ క్యాంపెయిన్ మంచి అవకాశం' అని ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. టర్మ్ బీమా, హై రిస్క్ ప్లాన్లను మినహాయించి ఇప్పటి వరకు చెల్లించిన ప్రీమియం ఆధారంగా ఆలస్య రుసుములో రాయితీ ఇస్తామని వెల్లడించింది. కొన్ని రకాల ఆరోగ్య, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్లకు రాయితీ లభిస్తుందని పేర్కొంది.
సంప్రదాయ, ఆరోగ్య బీమా పాలసీల చెల్లించాల్సిన ప్రీమియం రూ.లక్ష వరకు ఉంటే ఆలస్య రుసుములో రూ.2000 గరిష్ఠ పరిమితితో 20 శాతం రాయితీ ఇస్తామని ఎల్‌ఐసీ తెలిపింది. ఇక ప్రీమియం రూ.3 లక్షలకు పైగా ఉంటే రూ.3000 గరిష్ఠ పరిమితితో 30 శాతం రాయితీ ఇస్తామంది. ఇక మైక్రో ఇన్సూరెన్స్‌కు ఆలస్య రుసుములో పూర్తి రాయితీ ఇస్తామని ప్రకటించింది.
ఎల్‌ఐసీ ఐపీవోకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లోనూ దీని గురించి ప్రస్తావించారు. FY21-22 (H1FY22) ప్రథమార్ధంలో పన్నులు పోగా రూ.1437 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇది రూ.6.14 కోట్లే కావడం గమనార్హం. నికర ప్రీమియం రాబడి, పెట్టుబడులపై 12 శాతం ఆదాయం పెరగడం, బీమా విక్రయాల్లో వృద్ధి ఇందుకు దోహదం చేసింది. ఐపీవోకు ముందు వచ్చిన ఈ ఫలితాలు ఆశావహంగా కనిపిస్తున్నాయి.
2022 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కొత్త ప్రీమియం అభివృద్ధి రేటు 554.1 శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో ఇది 394.76 శాతమేనని ఎల్‌ఐసీ తెలిపింది. 2021 ఏప్రిల్-సెప్టెంబర్‌కు మొత్తం నికర ప్రీమియం రూ.1679 కోట్లకు పెరిగి రూ.1.86 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక ఓవరాల్ ప్రీమియం రూ.17,404 కోట్లకు పెరిగింది. పెట్టుబడులపై ఆదాయం రూ.3.35 లక్షల కోట్లకు పెరిగింది. ఇక H1FY22లో పెట్టుబడులపై ఆదాయం రూ.15,726 కోట్లుకు పెరిగి రూ.1.49 లక్షల కోట్లకు చేరుకుంది.
Also Read: Tata Steel Q3 Net Profit: టాటా స్టీల్! ఉక్కు కన్నా గట్టిగానే లాభాలు!
Also Read: Tata Nexon EV: అదిరిపోయే కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు.. లాంచ్ త్వరలోనే.. ఒక్కచార్జ్‌తో 500 కిలోమీటర్లు!