ప్రస్తుతం టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ కార్లు ఎంతో పేరు సంపాదించుకున్నాయి. ఇప్పుడు ఈ రెండు కార్లూ కొత్త రూపంలో లాంచ్ కానున్నాయి. ఈ రెండు కార్లకూ ఫేస్ లిఫ్ట్ వేరియంట్లు లభించనున్నాయి. అంటే వీటిలో పెద్ద బ్యాటరీలు, ఎక్కువ రేంజ్, మరిన్ని మంచి ఫీచర్లు ఉండనున్నాయి.


నెక్సాన్ ఈవీని తీసుకుంటే త్వరలో లాంచ్ కానున్న వేరియంట్ 400 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను అందించనుందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేరియంట్ 312 కిలోమీటర్ల రేంజ్‌నే అందించనుందని కంపెనీ తెలిపింది. అయితే రోడ్ల మీద డ్రైవ్ చేసినప్పుడు మాత్రం 200 కిలోమీటర్లకు పైబడిన రేంజ్‌నే అందించింది.


ఇప్పుడు పెద్ద బ్యాటరీని అందించారు కాబట్టి.. త్వరలో లాంచ్ కానున్న నెక్సాన్ ఈవీ కనీసం 300 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని ఆశించవచ్చు. ఇందులో గుండ్రటి డిస్క్ బ్రేకులు, మరిన్ని కొత్త ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.


ఇక ఎంజీ జెడ్ఎస్ ఈవీ విషయానికి వస్తే.. ఈ కారు కూడా కొత్త లుక్, మరింత విలాసవంతమైన ఇంటీరియర్‌తో ఈ కారు రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం జెడ్ఎస్ ఈవీ.. పాత ఎంజీ ఆస్టర్‌పై బేస్ చేసుకుని రూపొందింది. అయితే కొత్త జెడ్ఎస్‌లో మోడర్న్ ఇంటీరియర్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకా మరెన్నో ఫీచర్లు ఉండనున్నాయి.


కొత్త ఎంజీ జెడ్ఎస్ 500 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని తెలుస్తోంది. ఈ కారు డిజైన్ కూడా ఎంతగానో మారనుంది. ముందువైపు, వెనకవైపు కొత్త తరహా బంపర్లతో ఈ కారు లాంచ్ కానుంది. ఈ కారు లుక్ కూడా పూర్తి స్థాయి ప్రీమియంగా ఉండనుంది.