ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ విజయం సాధించాలని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. ఆసియాకప్‌ నుంచి ఇప్పటి వరకు కుర్రాళ్ల పోరాటం ఆకట్టుకుందని పేర్కొన్నాడు. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై గెలిచి ట్రోఫీ తీసుకురావాలని వెల్లడించాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌ సిరీసుపై తాము దృష్టి సారించామని అన్నాడు. ఇషాన్‌ కిషన్‌ తనతో కలిసి ఓపెనింగ్ చేస్తాడని స్పష్టం చేశాడు. తొలి వన్డేకు ముందు అతడు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.


'అండర్‌-19 జట్టు అదరగొడుతోంది. ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఎన్‌సీఏలో వారు కఠోరంగా శ్రమించారు. అప్పుడక్కడే ఉన్న నేను వారితో మాట్లాడాను. ఆసియా, ప్రపంచకప్‌ల్లో నా అనుభవం వివరించాను. ద్వైపాక్షిక సిరీసులు, ఐసీసీ టోర్నీలకు తేడా వివరించాను. ప్రపంచకప్పుల్లో వేర్వేరు జట్లు, వేర్వేరు ఆటగాళ్లు ఉన్నప్పుడు ఆలోచనా దృక్పథం గురించి చెప్పాను. మొదట ఆసియాకప్‌లో అదరగొట్టిన జట్టు ప్రపంచకప్‌లో అదరగొడుతోంది. వారు ఐదో కప్‌ తీసుకురావాలని కోరుకుంటున్నా' అని రోహిత్‌ అన్నాడు.


వెస్టిండీస్‌తో తొలి వన్డే గురించి హిట్‌మ్యాన్‌ వివరించాడు. ఈ పోరుకు అన్ని విధాలుగా సిద్ధమయ్యాని చెప్పాడు. ప్రస్తుతం తమ దృష్టి విండీస్‌ సిరీసుపైనే ఉందన్నాడు. టెస్టు కెప్టెన్సీ గురించి మాట్లాడేందుకు సమయం ఉందన్నాడు. విరాట్‌ కోహ్లీ సారథిగా ఉన్నప్పుడు తాను వైస్‌ కెప్టెన్‌గా ఉన్నానని గుర్తు చేశాడు. అతడెక్కడ వదిలేశాడో అక్కడ్నుంచే జట్టును ముందుకు  తీసుకెళ్తానని చెప్పాడు. ఐసీసీ టీ20, వన్డే ప్రపంచకప్‌లకు జట్టును నిర్మించాల్సి ఉందన్నాడు. జట్టులో సీనియర్‌గా అతడి నుంచి ఏం కోరుకుంటున్నామో విరాట్‌కు తెలుసన్నాడు.


వన్డే సిరీసుకు ముందు టీమ్‌ఇండియాలో కొందరు ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడ్డారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌కు పాజిటివ్‌ వచ్చింది. కేఎల్‌ రాహుల్‌ కొన్ని మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదు. దీంతో జట్టుకు ఓపెనర్ల సమస్య పట్టుకుంది. మయాంక్‌ అగర్వాల్‌ను పిలిపించినా ప్రొటోకాల్‌ ప్రకారం అతడు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా దిగుతాడని రోహిత్‌ చెప్పాడు. ముంబయి ఇండియన్స్‌లో వీరిద్దరూ కలిసి ఆడిన సంగతి తెలిసిందే.


Read Also: IND vs WI: విరాట్‌ ఊపు తీసుకొస్తే.. రోహిత్‌ ప్రశాంతత తెస్తాడన్న మాజీ ఆల్‌రౌండర్‌


Read Also: Rohit Sharma Captaincy: రోహిత్‌ కెప్టెన్సీలో ఇష్టమైంది అదే! కోహ్లీ సారథ్యంలో ఆడిన యువ పేసర్‌ అభిప్రాయం ఇదీ!