టాటా స్టీల్స్‌ అదరగొట్టింది! 2021, డిసెంబర్‌ 31తో ముగిసిన త్రైమాసికంలో చక్కని ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ ఏకీకృత లాభంలో 139 శాతం వృద్ధి నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.4,011 కోట్ల నికర లాభంతో పోలిస్తే ఈసారి రూ.9,598 కోట్లు ఆర్జించింది. ఈ త్రైమాసికంలో వర్కింగ్‌ క్యాపిటల్‌ రూ.2,045 కోట్లకు పెరిగినా ఫ్రీ క్యాష్ ఫ్లో రూ.6,338 కోట్లుగా పేర్కొంది. ఇక ఏకీకృత రాబడి 45 శాతం పెరిగి రూ.60,783 కోట్లకు చేరుకుంది. ఇంతకు ముందు ఇది రూ.41,935 కోట్లే కావడం గమనార్హం.


'కొవిడ్‌ మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. దాంతో భారత స్టీల్‌ డిమాండ్‌ పెరగడం మొదలైంది. ఈ ఆర్థిక ఏడాది తొలి తొమ్మిది నెలల్లో మా స్టీల్‌ డెలివరీ 4 శాతం పెరిగింది. మేం ఎంచుకున్న సెగ్మెంట్లో విలువను ఇలాగే పెంచుకుంటాం. సెమీ కండక్టర్ల కొరత ఉన్నప్పటికీ ఆటో సెగ్మెంట్లో స్టీల్‌ వినియోగం పెరిగింది. మా ఐరోపా వ్యాపారం సైతం రాణిస్తోంది' అని టాటా స్టీల్‌ ఎండీ, సీఈవో టీవీ నరేంద్రన్‌ అన్నారు.


'2022 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో టాటా స్టీల్‌ ఆర్థిక ప్రదర్శన, ఆపరేషన్స్ బాగున్నాయి. వార్షిక ప్రాతిపదికన ఎబిటా వృద్ధి 64 శాతం, పన్నేతర ఆదాయం వృద్ధి 139 శాతం నమోదైంది. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరుగుతున్నా నగదు ప్రవాహంలో మెరుగుదల గమనించాం. విపణిలో ఒడుదొడుకులు ఉన్నప్పటికీ  రూ.60,783 కోట్ల ఆదాయం, రూ.15,853 కోట్ల ఎబిటాతో నిలకడ ప్రదర్శించాం' అని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, చీఫ్ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ కౌషిక్‌ చటర్జీ అన్నారు. టాటా స్టీల్‌ షేరు ధర శుక్రవారం 0.9 శాతం లాభపడి రూ.1176 వద్ద స్థిరపడింది.


Also Read: Metaverse Meaning: మెటావర్స్.. ఓ మాయా ప్రపంచం.. సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ జిందగీ!


Also Read: Facebook Meta: మెటావర్స్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మార్క్.. ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం!