ప్రపంచం.. రోజుకో కొత్త రంగు పూసుకుంటోంది. ఈరోజు ఉన్న టెక్నాలజీ రేపటికి పాతదైపోతోంది. కొత్త ఆవిష్కరణలతో మనిషి ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతలను రూపొందిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ వంటి సాధనాలు.. ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యాయి.
ఇప్పుడు ఈ దిశగానే మరో ముందడుగు పడబోతోంది. తర్వాతి తరం ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. కొద్ది సంవత్సరాల్లో మనుషులు పూర్తిగా వర్చువల్ ప్రపంచంలోనే గడిపేలా సాంకేతికత రూపుదిద్దుకుంటోంది. అవును దాని పేరే మెటావర్స్ (Metaverse).
మెటావర్స్..
వాస్తవికతను తలదన్నేలా ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR), బ్లాక్‌చెయిన్ వంటి సాంకేతికతతో పాటు సోషల్ మీడియా కాన్సెప్ట్‌ల సాయంతో తయారు చేసిన రిచ్ యూజర్ ఇంటరాక్షన్ డిజిటిల్ దునియానే మెటావర్స్ అంటారు.
డిజిటల్ పరికరాల తెరలను చూడటానికే పరిమితమైన మనల్ని... అవధుల్లేని అంతర్జాల లోకంలో విహరించే వీలు కల్పిస్తుంది ఈ మెటావర్స్. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది అంతులేని ప్రపంచం. దూరంగా ఉన్నవాళ్లు ఒకరినొకరు వర్చువల్‌గానే కలుసుకోవచ్చు. ఆడుకోవడం, మాట్లాడుకోవడం, పని చేసుకోవడం.. ఇలా అన్ని పనులూ వర్చువల్‌గా, రియల్‌టైమ్‌లో ఒకరినొకరు చూస్తూ చేసుకోవచ్చు.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మెటావర్స్ కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు. ఫేస్‌బుక్‌ను ఓ సామాజిక మాధ్యమ సంస్థగా కంటే.. మెటావర్స్ కంపెనీగా ప్రజలు చూస్తారని ఇప్పటికే ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ఇప్పటికే తమ బ్రాండింగ్ పేరు కూడా మెటాగా మార్చేశారు జుకర్‌బర్గ్.
హైలెట్స్..
- ఇప్పటివరకు టూ డైమెన్షనల్ డిజిటల్ స్పేస్‌లను మాత్రమే చూసిన యూజర్స్ ఇక అంతులేని వర్చువల్ రియాలిటీ భావనను అనుభవిస్తారు.
- కంటెంట్ క్రియేటర్స్, డిజైనర్స్ (ముఖ్యంగా 3D మోడలింగ్, వర్చువల్ రియాలిటీ నిపుణులు)కు భవిష్యత్తులో లెక్కలేనన్ని అవకాశాలు రానున్నాయి.
- మెటావర్స్ ఒక కొత్త ఆర్థిక వ్యవస్థకు తెరలేపుతోంది. ఇక్కడే సంపదను సృష్టించి పెద్ద ఎత్తున వ్యాపారం చేసే స్థాయికి మెటావర్స్ చేరుకోవచ్చు. బయట ప్రపంచంలో వినియోగంలో ఉన్న కరెన్సీ హెచ్చుతగ్గులను కూడా ప్రభావితం చేసే స్థాయిలో మెటావర్స్ నిలిచే అవకాశం ఉంది.
- అయితే మెటావర్స్ కార్యరూపం దాల్చడానికి కొత్త టెక్నాలజీలు కూడా అవసరమవుతాయి.
- కానీ సమాచార గోప్యత, భద్రతపై మాత్రం తీవ్ర ఆందోళనలు ఉన్నాయి. వాస్తవిక ప్రపంచంలో ఉన్న సమస్యలు వర్చువల్‌గా రూపాంతరం చెందినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా దిగ్గజ సంస్థ పెద్ద ఎత్తున మెటావర్స్‌లో పెట్టుబడులు పెడుతోంది. మరి మెటావర్స్‌తో ఎదురయ్యే సవాళ్లను ఫేస్‌బుక్ ఎలా డీల్ చేయబోతోంది చూద్దాం.
మెటావర్స్.. తొలిసారిగా
మెటావర్స్ అనే పదం చాలా మందికి కొత్తదే కావొచ్చు. కానీ దాదాపు మూడు దశాబ్దాలకు ముందే దీని గురించి ప్రస్తావన వచ్చింది. అమెరికన్ సైన్స్ ఫిక్షన్ రచయిత నీల్ స్టీఫెన్‌సన్ 1992లో రాసిన తన నవల 'స్నో క్రాష్'లో మెటావర్స్‌ను తొలిసారి పరిచయం చేశారు. ఆ నవలలో ఓ భయంకరమైన ప్రపంచం నుంచి మెటావర్స్ సాయంతో మనుషులు తప్పించుకుంటారు.
గత 30 ఏళ్లుగా మెటావర్స్‌పై చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు. వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచం కూడా కొత్త సాంకేతికత వైపు పరుగులు పెడుతోంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ మెటావర్స్ సాయంతో భవిష్యత్తులో మనుషులు డిజిటల్ అవతార్లుగా మారినా మారిపోవచ్చు. డిజిటల్ ఆస్తులు, డిజిటల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా జరగొచ్చు.
నిజానికి మెటావర్స్ గురించి ఆలోచించిన మొదటి సంస్థ ఫేస్‌బుక్ కాదు.2017 మార్చిలోనే డిసెంట్రల్యాండ్ అనే ఓ స్టార్ట్‌అప్ కంపెనీ ఇదే విధానాన్ని అవలంబించింది. తమ వినియోగదారులకు వర్చువల్ రియాలిటీ ప్రపంచాన్నా పరిచయం చేసింది. డిజిటల్ వాలెట్స్, క్రిప్టో కరెన్సీ వినియోగిత మార్కెట్‌ను అందించింది.
ఫేస్‌బుక్ ఉద్దేశంలో..
ఫేస్‌బుక్ ఉద్దేశంలో మెటావర్స్ అంటే ఏంటంటే..
ఫేస్‌బుక్ కాకుండా.. చాలా సంస్థలు మెటావర్స్‌పై పని చేస్తున్నాయి. అంతర్జాలం మాదిరిగానే ఒక్కరితో ఈ వ్యవస్థ రూపుదిద్దుకోదని జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. ఏ కంపనీ సొంతంగా మెటావర్స్‌ను సిద్ధం చేయలేదని చెప్పారు.ఫేస్‌బుక్ దీనిపై దృష్టి సారించినంత మాత్రాన.. ఆ సంస్థ గానీ, ఇతర దిగ్గజ సంస్థలు గానీ ఈ రంగంలో ఆధిపత్యం చెలాయించే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. మరి ఏమవుతుందో చూద్దాం.