ఫేస్‌బుక్ ఇప్పటివరకు మెటాపై పెట్టిన ఖర్చును మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించాడు. ఇప్పటివరకు మొత్తంగా 10 బిలియన్ డాలర్లను (సుమారు రూ.74,800 కోట్లు) మెటావర్స్‌పై ఖర్చు పెట్టినట్లు తెలిపారు. మెటావర్స్ కోసం మార్క్ జుకర్ బర్గ్ విజన్‌ను ఇది తెలుపుతుంది.


మెటాపై పెట్టిన ఖర్చును ఫేస్‌బుక్ ప్రకటించడం ఇదే మొదటిసారి. వర్చువల్ రియాలిటీ హెడ్ సెట్లు మొత్తం బిజినెస్‌లో చాలా తక్కువ కాబట్టి.. ఈ వివరాలను కంపెనీ ప్రకటించలేదు. ఇది ఇన్‌స్టాగ్రామ్‌ను కొనుగోలు చేయడానికి పెట్టిన మొత్తానికి ఏకంగా పది రెట్లు ఎక్కువ కావడం విశేషం.


దీంతో మెటా లాభాలు 8 శాతం మేర పడిపోయాయి. అయితే యాపిల్ తన మొబైల్ ఆపరేటింగ్ సిస్టంకు పలు మార్పులు చేయడం ద్వారా తమకు కాస్త ఎదురు దెబ్బ తగిలిందని మెటా తెలిపింది. ఐఫోన్ వినియోగదారుల డిజిటల్ హ్యాబిట్స్‌ను ట్రాక్ చేయడం కష్టం అయ్యేలా యాపిల్ తన ఓఎస్‌కు మార్పులు చేసింది. దీంతో వినియోగదారులకు టార్గెటెడ్ యాడ్స్ ఇవ్వడం తగ్గిందన్నారు. దీని కారణంగా గత సంవత్సరం 10 బిలియన్ డాలర్ల ఆదాయం తగ్గిందని మెటా తెలిపింది.


గత కొన్ని సంవత్సరాల నుంచి మెటా యాపిల్‌పై ఆధారపడటం తగ్గించాలనుకుంటుంది. కానీ ఐఫోన్ యూజర్లలో కూడా ఫేస్ బుక్ వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు. గత అక్టోబర్‌లో కంపెనీని మెటావర్స్ వైపు నడిపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు. ఫేస్‌బుక్ కంపెనీ పేరును కూడా మెటా అని మార్చారు.


వాస్తవికతను తలదన్నేలా ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వర్చువల్ రియాలిటీ (VR), బ్లాక్‌చెయిన్‌ వంటి టెక్నాలజీతో పాటు సోషల్ మీడియా కాన్సెప్ట్‌ల సాయంతో తయారు చేసిన రిచ్ యూజర్ ఇంటరాక్షన్‌ డిజిటిల్ ప్రపంచాన్నే మెటావర్స్ అంటారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మెటావర్స్ కీలక పాత్ర పోషించనుందని నిపుణులు భావిస్తున్నారు.