ఒకప్పుడు తెలుగులో మహేష్ బాబు మాత్రమే ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ లో కనిపించేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలందరూ యాడ్స్ పై దృష్టి పెట్టారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ కూడా కమర్షియల్ యాడ్స్ తో బిజీ అయ్యారు. అయితే అతడు చేస్తోన్న యాడ్స్ ఏదోక రకంగా వివాదంలో చిక్కుకుంటున్నాయి.
ఇప్పటికే బన్నీ నటించిన ర్యాపిడో యాడ్ విషయంలో రచ్చ జరిగింది. ఆర్టీసీ బస్సులను కించపరిచే విధంగా యాడ్ ఉందంటూ టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభ్యంతరం పెట్టారు. దీంతో ఆ యాడ్ ను మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు బన్నీ నుంచి వచ్చిన మరో కొత్త యాడ్ చుట్టూ కూడా వివాదం రాజుకుంటుంది. జొమాటో బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ బన్నీ ఓ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే.
అయితే ఆ యాడ్ సౌత్ సినిమాలను కించపరిచేలా ఉందంటూ నెటిజన్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్ లో బన్నీ మరో నటుడు సుబ్బరాజ్ ను ఒక్క కిక్కుతో గాల్లోకి లేచేలా కొడతారు. గాల్లో తేలుతూ.. బన్నీ నన్ను కొంచెం త్వరగా కిందపడేయవా అని సుబ్బరాజ్ అడిగితే 'సౌత్ సినిమా కదా ఎక్కువసేపు ఎగరాలి' అంటూ బన్నీ డైలాగ్ కొడతాడు. ఈ డైలాగ్ బన్నీ చెప్పడం నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తోంది.
తెలుగు, తమిళ సినిమాల్లో ఫైట్ సీన్స్ ఇలానే ప్లాన్ చేస్తుంటారు. కొన్ని హిందీ సినిమాల్లో కూడా ఉంటాయనుకోండి. అయితే బన్నీ స్పెషల్ గా సౌత్ సినిమాలను మెన్షన్ చేయడం ప్రేక్షకులను నచ్చడం లేదు. సౌత్ సినిమాలతో ఎదిగి.. సౌత్ సినిమా ఇండస్ట్రీని కించపరిచేలా బన్నీ డైలాగ్ చెప్పడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ప్రముఖులెవరూ స్పందించకపోవడంతో జొమాటో వాళ్లు కూడా లైట్ తీసుకున్నట్లు ఉన్నారు.