ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ను ఇంటికి తీసుకొచ్చేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. యశ్‌ధుల్‌ సారథ్యంలోని జట్టు రికార్డులు సృష్టించేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే నాలుగుసార్లు కప్పు కొట్టిన భారత్‌కు ఐదోసారీ ట్రోఫీ అందించాలని పట్టుదలగా ఉంది. జట్టులో అంతా బాగానే ఆడుతున్నా ఇంగ్లాండ్‌తో ఫైనల్లో ఐదుగురు ఆటగాళ్లు అత్యంత కీలకం కానున్నారు. పనిలో పనిగా ఐపీఎల్‌ వేలంలోనూ భారీ ధర దక్కించుకొనే అవకాశం ఉంది.


యశ్‌ ధుల్‌ (కెప్టెన్‌)


టీమ్‌ఇండియాను టోర్నీ సాంతం అద్భుతంగా నడిపించాడు కెప్టెన్‌ యశ్‌ ధుల్‌. టోర్నీలోనే కరోనా బారిన పడ్డ అతడు తిరిగొచ్చాక దంచికొడుతున్నాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై వరుసగా అర్ధశతకాలు సాధించాడు. ఇక సెమీస్‌లో అతడు చేసిన శతకానికి చాలామంది సీనియర్‌ క్రికెటర్లు ఫిదా అయ్యారు. వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం అందించాడు. ఇంగ్లాండ్‌పై ఫైనల్లో ఇతడెంతో కీలకం.


షేక్‌ రషీద్‌ (వైస్‌ కెప్టెన్‌)


ఈ గుంటూరు కుర్రాడు దాదాపుగా విరాట్‌ కోహ్లీ పాత్ర పోషిస్తున్నాడు. వన్‌డౌన్‌లో వస్తూ కీలక భాగస్వామ్యాలు అందిస్తున్నాడు. అవసరమైనప్పుడు దూకుడుగా ఆడతాడు. వికెట్లు పడుతుంటే నిలకడగా పరుగులు చేస్తాడు. వైస్‌ కెప్టెన్‌గా ఉంటూ యశ్‌కు అండగా నిలుస్తున్నాడు. సెమీస్‌లో ఆసీస్‌పై అతడు 90+ పరుగులు చేశాడు. బంగ్లాపై 72తో ఆకట్టుకున్నాడు.


విక్కీ ఓత్వ్సల్‌


గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తున్నాడు విక్కీ. దక్షిణాఫ్రికాపై ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. పిచ్‌, వాతావరణాన్ని బట్టి బౌలింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. చక్కని వైవిధ్యం ప్రదర్శిస్తున్నాడు. పేస్‌ బౌలర్లతో కలిసి బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. ఫైనల్లో ఆంగ్లేయులను బోల్తా కొట్టించాలంటే అతడి స్పిన్‌ పనిచేయాల్సిందే.


అంగ్‌క్రిష్‌ రఘువంశీ


రఘువంశీ రూపంలో టీమ్‌ఇండియాకు భవిష్యత్తు ఆల్‌రౌండర్‌ కనిపిస్తున్నాడు. ఉగాండాపై అతడు 144 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. శ్రీలంక పైనా అర్ధశతకంతో చెలరేగాడు. అవసరమైన ప్రతిసారీ బంతితోనూ ప్రతిభ కనబరిచాడు. ఫైనల్లో కచ్చితంగా అతడి సేవలు వెలకట్టలేనంత విలువైనవి అవుతాయి.


హర్‌నూర్‌ సింగ్‌


టీమ్‌ఇండియా కరోనాతో ఇబ్బంది పడ్డప్పుడు హర్‌నూర్‌ సింగ్‌ ఆదుకున్నాడు. తన ఓపెనింగ్‌తో మెరుపులు మెరిపించాడు. ఐర్లాండ్‌పై అతడు చేసిన 88 పరుగులు అద్భుతమే! మిగతా మ్యాచుల్లో ఎక్కువ పరుగులు చేయలేదు కానీ సామర్థ్యం మేరకు ఆడితే తిరుగుండదు. అటు పేసర్లు, ఇటు స్పిన్నర్లను చక్కగా ఎదుర్కోగలడు. మెరుగైన భాగస్వామ్యాలు చేయగల సత్తా అతడిలో ఉంది.


Read Also: IND vs WI: విరాట్‌ ఊపు తీసుకొస్తే.. రోహిత్‌ ప్రశాంతత తెస్తాడన్న మాజీ ఆల్‌రౌండర్‌


Read Also: Rohit Sharma Captaincy: రోహిత్‌ కెప్టెన్సీలో ఇష్టమైంది అదే! కోహ్లీ సారథ్యంలో ఆడిన యువ పేసర్‌ అభిప్రాయం ఇదీ!