Salary Hikes: టెలికాం రంగ ఉద్యోగులకు గుడ్‌న్యూస్! ఈ ఏడాది వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. ప్రతిభావంతులకు డిమాండ్ పెరగడంతో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సహా మిగతా ఆపరేటర్లు భారీ స్థాయిలో జీతాలు పెంచుతున్నారు. గతేడాది సగటు పెంపు 7.5 శాతంతో పోలిస్తే ఈ ఏడాది 10-12 శాతంగా ఉందని స్టాఫింగ్ కంపెనీలు చెబుతున్నాయి. పైన చెప్పిన మూడు కంపెనీల సగటు ఇంక్రిమెంటు పెరుగుదల 8-12 శాతంగా ఉందని తెలిసింది.
వేతనాల పెరుగుదల గురించి కంపెనీలు ఇప్పటికే తమ ఉద్యోగులకు తెలియజేశాయి. కొన్ని కంపెనీలు భారీ వేతనాలు ఇస్తుండగా మిగతావీ జులై నుంచి అమలు చేస్తాయని స్టాఫింగ్ కంపెనీలు అంచనా. దాదాపుగా అన్ని కంపెనీలు సమానంగా వేతనాలు చెల్లిస్తున్నాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ టెలికాం, ఐటీ, ఐటీఈఎస్ విభాగాధిపతి దవల్ సింగ్ తెలిపారు.
Also Read: హైదరాబాద్‌లో అద్దెకు ఉంటున్న వాళ్లకు షాకింగ్- ఇంటి ఓనర్ అవ్వడం నాట్ సో ఈజీ!!
Also Read: వాహన బీమా రూల్స్ ఛేంజ్! ఎన్ని కి.మీ. తిప్పితే అంతే ప్రీమియం!
టెలికాం రంగంలో మౌలిక సదుపాయాలు, పనిముట్ల సరఫరాదారులు, వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటింగ్ వంటి విభాగాలు ఉన్నాయి. అన్నింట్లో కలిపి 40 లక్షల మంది వరకు పనిచేస్తున్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకొనే ప్రతిభావంతులకు ఈ మధ్య డిమాండ్ విపరీతంగా పెరిగింది. 'అలాంటి ప్రతిభావంతులు తక్కువ జీతాలకు రారు. అన్ని రంగాల మాదిరిగానే వారికీ అధిక వేతనాలు అందించాల్సిందే. కొత్త తరం ప్రతిభావంతులను ఆకర్షించేందుకు టెలికాం కంపెనీలు భారీ ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి' అని దవల్ సింగ్ తెలిపారు.
దేశవ్యాప్తంగా 5జీ సేవలు మొదలు పెట్టేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అందుకే బాగా పనిచేసే ఉద్యోగుల నైపుణ్యాలకు మరింత పదును పెట్టేందుకు కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. ఇందు కోసమే మానవ వనరుల బడ్జెట్‌ను 8-10 శాతం పెంచుతున్నారు. కరోనా మహమ్మారి తర్వాత టెలికాం రంగంలోనూ డిజిటలైజేషన్ పెరిగింది. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాల్సి వచ్చింది.
5జీ వచ్చాక క్లౌడ్ కంప్యూటింగ్, కృతిమ మేధస్సు విశ్లేషణ, ఐటీ ఆధారిత సేవలు, మొబైల్ యాప్ అభివృద్ధి సేవలు విస్తృతంగా అవసరం అవుతాయి. ఫలితంగా ఈ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ వేతనాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ఇవ్వాల్సి వస్తోంది.
Also Read: ఏడాదిలో లక్షకు రూ.13 లక్షల ప్రాఫిట్! 800% ర్యాలీ చేసిన మల్టీబ్యాగర్