Multibagger Share: స్టాక్‌ మార్కెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి జీకేపీ ప్రింటింగ్‌ అండ్‌ ప్యాకింగ్‌ (GKP Printing and Packing) కంపెనీ ఇన్వెస్టర్లకు లాభాల పంట పండిస్తోంది. ఏడాదిలో కాలంలోనే 800 శాతం ర్యాలీ అయింది. కేవలం బీఎస్‌ఈలో మాత్రమే నమోదైన ఈ కంపెనీ ఇప్పుడు ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యేందుకు సిద్ధమైంది. డైరెక్ట్‌ లిస్టింగ్‌ మార్గం ద్వారా షేర్లను నమోదు చేసేందుకు దరఖాస్తు చేశామని కంపెనీ బోర్డు ప్రకటించింది.


గతేడాది ఏప్రిల్‌లో ఈ కంపెనీ బీఎస్‌ఈలో రూ.15 వద్ద నమోదైంది. అప్పట్నుంచి 800 శాతం ర్యాలీ చేసింది. 2021, జులైలో రూ.23గా ఉన్న షేరు ధర ప్రస్తుతం 52 వారాల గరిష్ఠమైన రూ.203కు చేరుకుంది. ఏడాది క్రితం ఈ కంపెనీలో రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడది రూ.8.83 లక్షలుగా మారేది. 2021 ఏప్రిల్‌లో పెట్టుంటే ఇప్పుడు మీ చేతికి రూ.13.54 లక్షలు అందేవి.


జీకేపీ ప్రింటింగ్‌ అండ్‌ ప్యాకింగ్‌ కంపెనీ గుజరాత్‌లోని వాపిలో ఈ మధ్యే 43,234 చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేసింది. వ్యాపారం, తయారీ యూనిట్లను విస్తరించనుంది. కొనుగోలు చేసిన స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు సైతం పొందింది. మాస్టర్‌ కార్టూన్స్‌, మోనో కార్టూన్స్‌, హనీకాంబ్‌ పార్టిషన్‌ బాక్సులు, స్టోరేజ్‌ బిన్స్‌, అడ్జస్టబుల్‌ యూనిట్‌ కార్టూన్స్ వంటి కరుగేటెడ్‌ బాక్సులను ఈ కంపెనీ తయారు చేస్తుంది. క్రాఫ్ట్‌ పేపర్‌, డూప్లెక్స్‌ పేపర్‌, తక్కువ మందం గల ప్లాస్టిక్‌ రోల్స్‌నూ ఉత్పత్తి చేస్తోంది.


వస్త్రాల ఎగుమతులు, స్టీల్‌ పాత్రలు, ప్లేయింగ్‌ కార్డులు, మద్యపానం, బొమ్మలు, ఫార్మా, ప్రింటర్లు, ఇంజినీరింగ్‌, కన్ఫెక్షనరీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. టీసీఎస్‌, స్పెక్ట్రా ఇంటర్నేషనల్‌, నాప్టాల్‌, షాప్‌ సీజే, ఎంఎమ్‌ ఫుడ్స్‌, అల్మాట్స్‌ బ్రాండింగ్‌ సొల్యూషన్స్‌ వంటి కంపెనీలు జీకేపీకి క్లయింట్లు.


ఎన్‌ఎస్‌ఈలో నమోదవుతోంది కాబట్టి షేర్లు కొనుగోళ్లు చేయొచ్చని కొన్ని బ్రోకింగ్‌ కంపెనీలు సూచిస్తున్నాయి. దిద్దుబాటు జరిగేంత వరకు ఓపిక పట్టాలని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. అమ్మకాల్లో వృద్ధి చివరి మూడేళ్ల నుంచి 30 శాతంగా ఉన్నప్పటికీ ముడి వనరుల ధరల పెరుగదలతో నిర్వాహక గణాంకాలు తగ్గాయని చెబుతున్నారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.