Vehicle insurance: కస్టమర్లకు గుడ్‌న్యూస్! త్వరలో వాహన బీమా (Auto Insurance) నిబంధనలు మారుతున్నాయి. వినియోగదారుడికి అనుకూలమైన టాప్ అప్ ప్లాన్లు వస్తున్నాయి. వెహికిల్‌ను ఉపయోగించిన తీరు, నడిపించిన విధానాన్ని బట్టి ఇకపై ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదండోయ్..! ఎన్ని వాహనాలు ఉన్నా ఒకే బీమా పథకం తీసుకొనే సౌకర్యం అమల్లోకి రానుంది.
'టెక్నాలజీ ఆధారిత వాహన బీమాను ప్రోత్సహించాలని ఐఆర్‌డీఏఐ (IRDAI) నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా టెక్నాలజీ ఆధారిత మోటార్ డ్యామేజీ బీమా పథకాలను ప్రవేశపెట్టేందుకు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. 1) వాహనం ఉపయోగించిన తీరు 2) వాహనం నడిపిన తీరు 3) బైకులు, కార్లకు కలిపి ఒకే రకమైన ఫ్లోటర్ పాలసీలు రానున్నాయి' అని బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
Pay as you drive : వాహనాన్ని ఉపయోగించిన తీరును బట్టి వినియోగదారులు ఇందులో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే కస్టమర్ ఏడాది మొదట్లోనే ఎంత వరకు బైక్ లేదా కారును ఉపయోగిస్తాడనేది ముందుగానే డిక్లరేషన్ ఇవ్వాలి. ఉదాహరణకు ఒక ఏడాదిలో ఎన్ని కిలోమీటర్లు తిప్పుతారో చెప్పాలి! జియో ట్యాగింగ్ ఆధారిత యాప్‌ల ద్వారా యూసేజ్‌ను ట్రాక్ చేస్తారు. అయితే ముందే పెట్టుకున్న లిమిట్ దాటితే క్లెయిమ్ ఎలా చేస్తారన్నది కంపెనీలు ఇంకా వివరణ ఇవ్వలేదు.
Pay how you drive : కారు లేదా బైక్ యజమాని ప్రవర్తన ఆధారంగా ఈ యాడ్ ఆన్ స్కీమ్ ఉంటుంది. వేగం, వాడకం సహా ఇతర అంశాలను ఇన్సూరెన్స్ కంపెనీ లైవ్ ట్రాక్ చేయనుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీ మోటార్ కవరేజీ ఇస్తుంది. ప్రీమియాన్ని నిర్ణయిస్తుంది.
Floater Policy: ఆరోగ్య బీమాలో ఫ్లోటర్ పాలసీల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు దానిని వాహన విభాగంలో ప్రవేశపెడుతున్నారు. ఒకటి కన్నా ఎక్కువ వాహనాలు ఉంటే గతంలో వేర్వేరుగా బీమా తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కారు, బైక్ అనే తేడా లేకుండా అన్నింటికీ కలిపి బీమా తీసుకోవచ్చు.
వాహన బీమాల్లో చేస్తున్న ఈ మార్పులు అటు కంపెనీలు, ఇటు కస్టమర్లకు ఉపయోగపడతాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి తన బైక్‌ను నెలకు 100-200 కిలోమీటర్లే తిప్పుతాడనుకుంది. మరొకరు 1200-1500 కిలోమీటర్లు నడుపుతాడని అనుకుందాం. ఇంతకు ముందైతే ఇద్దరూ ఒకే ప్రీమియం చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు తక్కువ వాడేవారు తక్కువ ప్రీమియం కట్టొచ్చు. అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేసేవారు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. అయితే కనీస బీమాపై యాడ్ ఆన్స్ తీసుకోవాల్సి వస్తుంది.