Home Sales In Telangana: ఇళ్ల విక్రయాల్లో హైదరాబాద్‌ రికార్డులను తిరగరాస్తోంది. 11 ఏళ్ల గరిష్ఠ స్థాయికి అమ్మకాలు చేరుకున్నాయి. గతేడాది ప్రథమార్ధంలో 11,974 ఇళ్లను అమ్మగా 2022 జనవరి-జూన్‌ మధ్యకాలంలో 14,693 యూనిట్లను విక్రయించిందని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా రియల్‌ ఎస్టేట్‌ రిపోర్టు పేర్కొంది.


'దేశంలో పరిగణనలోకి తీసుకొనే ఎనిమిది మార్కెట్లలో ఒక్క హైదరాబాద్‌లోనే 2013 ప్రథమార్ధం నుంచి ఒక్కసారైనా ధరలు తగ్గలేదు. 2020లో కరోనా మహమ్మారితో అవాంతరాలు వచ్చినా నగరంలో ధరలు స్థిరంగా కొనసాగాయి. ఇది భాగ్యనగరం మార్కెట్‌ సత్తాకు నిదర్శనం' అని నైట్‌ఫ్రాంక్‌ నివేదిక తెలిపింది.


Also Read: యాహూ..! 16,000 పైకి నిఫ్టీ - టైటాన్‌ షేరు జోరు


హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులే ఎక్కువగా ఇళ్లను సొంతం చేసుకుంటున్నారు. కరోనా సమయంలో వీరికి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. నగరంలో స్థిరాస్తి మార్కెట్‌ను స్థిరంగా ఉంచడంలో వీరిదే కీలక పాత్ర.


'భాగ్యనగరం ఇక ఎంత మాత్రం తక్కువ ధరకే ఇళ్లు దొరికే మార్కెట్‌ కాదు! చాలామంది కస్టమర్లు, ఇన్వెస్టర్లకు ఇది ఇష్టమైన  గమ్యస్థానంగా మారింది. 2022 ప్రథమార్ధంలో నివాస యోగ్యమైన ఇళ్ల ధరలు 4.2 శాతం పెరిగాయి' అని నివేదిక వెల్లడించింది.


ఐటీ రంగ కంపెనీలు హైదరాబాద్‌లో ఎక్కువ ఆఫీస్‌ స్పేస్‌ తీసుకుంటున్నారు. బిజినెస్‌ వర్గాలు, ఇన్వెస్టర్లలో నగరంపై విశ్వాసం మరింత పెరుగుతోంది. 2021 ప్రథమార్ధంలో 0.8 మిలియన్‌ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరగ్గా 2022 ప్రథమార్ధంలో ఇది 1.2 మిలియన్లకు పెరిగింది.


గతేడాది 1.60 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉన్న ఆఫీస్‌ మార్కెట్‌ పెర్ఫామెన్స్‌ లావాదేవీలు ఈ సారి 101 శాతం పెరిగి 3.2 మిలియన్లకు చేరుకుంది. కొత్త కార్యాలయాల నిర్మాణం 5.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ రంగం వాటా లావాదేవీలు 12 శాతం ఎగిశాయి. అద్దెల స్థాయి 3.3 శాతం పెరిగింది. మొత్తం లావాదేవీల్లో శివారు ప్రాంతాల వాటా 71 శాతంగా ఉంది.


Also Read: మారుతి సుజుకి విటారా లాంచ్ త్వరలోనే - క్రెటా, సెల్టోస్‌లకు గట్టిపోటీ!


Also Read: కేవీపీ స్కీమ్‌లో అంత వడ్డీ ఇస్తారా! మరి టాక్స్‌ బెనిఫిట్‌ సంగతేంటి?