Hyderabad Real Estate:
హైదరాబాద్, శివారు జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ ఏడాది నవంబర్లో ఏకంగా 6,119 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. నెలవారీగా చూస్తే 32 శాతం వృద్ధి నమోదైంది. వీటి విలువ సుమారు రూ.2,892 కోట్లు ఉంటుందని నైట్ ఫ్రాంక్ ఇండియా అధ్యయనంలో తేలింది.
ఈ ఏడాది ఆరంభం నుంచి హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకుంది. ఇప్పటి వరకు రూ.30,415 కోట్ల విలువైన 62,159 ఇళ్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే మాత్రం స్వల్ప తగ్గుదల కనిపించింది. గతేడాది నవంబర్ నాటికి హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో రూ.33,531 కోట్ల విలువైన 75,453 ఇళ్లు రిజిస్ట్రేషన్ చేశారని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.
నవంబర్ నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో రూ.25-50 లక్షల విలువైన ఇళ్ల వాటా 50 శాతంగా ఉంది. 2021 నవంబర్‌తో పోలిస్తే 37 శాతం వృద్ధి కనిపించింది. రూ.25 లక్షల లోపు విలువైన ఇళ్ల నమోదు మాత్రం తగ్గింది. వీటికి ఎక్కువ డిమాండ్ ఉండటం లేదు. గతేడాది ఇదే సమయంలోని 39 శాతంతో పోలిస్తే 22 శాతానికి తగ్గిపోయింది. ఎక్కువ విలువైన ఇళ్లకు డిమాండ్ బాగానే ఉంది. నవంబర్లో రూ.50 లక్షలకు పైగా విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 28 శాతం పెరిగాయి. గతేడాది నవంబర్లో ఇది 24 శాతమే కావడం గమనార్హం.
ఇక 2021 నవంబర్లో 500-1000 చదరపు గజాల యూనిట్ల రిజిస్ట్రేషన్లు 15 శాతం ఉండగా ఇప్పుడు 22 శాతానికి పెరిగాయి. అయితే 1000 చదరపు గజాలకు మించిన యూనిట్ల రిజిస్ట్రేషన్లు గతేడాది 74 శాతం ఉండగా ఈసారి 65 శాతానికి తగ్గాయి. జిల్లాల వారీగా గమనిస్తే.. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో 41 శాతం రిజిస్ట్రేషన్లు అయ్యాయి. 39 శాతంతో రంగారెడ్డి తర్వాతి స్థానంలో నిలిచింది. ఇక మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ వాటా 14 శాతం రికార్డైంది.
ఈ ఏడాడి నవంబర్లో విక్రయించిన స్థిరాస్తుల ధరలు 12 శాతం పెరిగాయి. విచిత్రంగా సంగారెడ్డిలో వార్షిక ప్రాతిపదికన 47 శాతం పెరగడం గమనార్హం. ఎక్కువ విలువైన ప్రాపర్టీలు ఇక్కడే విక్రయిస్తున్నారని తెలుస్తోంది. హైదరబాద్ నగరంలోనూ ధరల పెరుగుదల కనిపించింది.
'హైదరాబాద్ నగరంలో నవంబర్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు 32 శాతంగా పెరగ్గా వార్షిక ప్రాతిపదికన 21 శాతం తగ్గాయి. వడ్డీరేట్ల పెరుగుదల, జియో పొలిటికల్ టెన్షన్లు ఉన్నప్పటికీ మార్కెట్ పుంజుకుంది. ఎక్కువ విలువైన ఇళ్లకు డిమాండ్ మాత్రం పెరుగుతూనే ఉంది' అని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ అన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు బాగుండటం, చక్కని వాతావరణం, వ్యాపార అనుకూల విధానాలు మార్కెట్ వృద్ధికి దోహదం చేస్తున్నాయని నైట్ ఫ్రాంక్ సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ పేర్కొన్నారు.
Also Read: పన్ను పడని ఫండ్లు - ఈ ఏడాది బెస్ట్ టాక్స్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్లు ఇవే!
Also Read: ‘పీఎం నారీ శక్తి యోజన’ కింద ₹2.20 లక్షలు వస్తాయా? నిజమేనా?