RBI Repo Rate Hike:
ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించేందుకు ఆర్బీఐ రెపోరేట్లను పెంచుతూనే ఉంది. బుధవారం మరో 35 బేసిస్ పాయింట్లు సవరించింది. దాంతో విధాన వడ్డీరేటు 2018 ఆగస్టు నాటి అత్యధిక స్థాయి 6.25 శాతానికి చేరుకుంది. 2022 మే నుంచి చూస్తే వడ్డీరేటు ఏకంగా 2.25 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో మీ వేతనం 2023లో కనీసం పది శాతం పెరిగినా గృహ రుణాల ఈఎంలు కట్టేందుకు సరిపోదని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది!
ఈఎంఐకే 50 శాతం
కొన్నేళ్ల క్రితం హోమ్ లోన్ తీసుకున్న వారితో పోలిస్తే ఈ మధ్యే తీసుకున్న వారికి వడ్డీరేట్ల నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పాతవాళ్లు కట్టాల్సిన అసలు, వడ్డీ తగ్గిపోయి ఉంటుంది. బుధవారం పెంచిన రేట్ల పెంపు 2023 జనవరి నుంచే అమల్లోకి వస్తుంది. దాంతో జీతంలో ఎక్కువ శాతం ఈఎంఐ చెల్లించేందుకే సరిపోతుంది. బ్యాంకులు మీ చేతికొచ్చే నికర వేతనంలో గరిష్ఠంగా 50 శాతం వరకే నెలసరి వాయిదాలు కట్టేందుకు అంగీకరిస్తాయి.
పెరిగిన నెలసరి వాయిదా
ఉదాహరణకు నెలకు రూ.62,000 వేతనం అందుకుంటున్న ఉద్యోగి 2022 మార్చిలో రూ.40 లక్షలు ఇంటి రుణం తీసుకున్నాడని అనుకుందాం. 20 ఏళ్లకు 7 శాతం వడ్డీకి తీసుకున్నాడు. అప్పుడతని నెలసరి వాయిదా గరిష్ఠంగా రూ.31,012గా ఉంటుంది. రెపోరేట్ల సవరణతో 2023, జనవరి నుంచి చెల్లించాల్సి వడ్డీ రేటు 9.25 శాతానికి చేరుతుంది. అంటే ఈఎంఐ రూ.36,485కు పెరుగుతుంది. అంటే జీతంలో 59 శాతం దానికే సరిపోతుంది.
10% జీతం పెరిగినా!
వచ్చే ఏడాది ఆ ఉద్యోగి వేతనాన్ని పది శాతం పెంచినా ఈఎంఐలకు ఏ మాత్రం సరిపోదు! ఎందుకంటే పెరిగిన జీతంలో ఈఎంఐ వాటా 53.5 శాతంగా ఉంటుంది. నెలకు రూ.36,485 బ్యాంకుకు చెల్లించాలి. దాంతో వేతనం పెరిగిందన్న ఆనందమే మిగలదు. ఒకవేళ యాజమాన్యం మీ వేతనం పెంచలేదంటే 58.84 శాతం ఈఎంఐగా చెల్లించక తప్పదు. ఇప్పటితో పోలిస్తే ఐదేళ్ల క్రితం గృహ రుణం తీసుకున్నవారికి కాస్త ఊరట లభించనుంది. జీతం పెరిగిన సంతోషం ఉంటుంది. కట్టాల్సిన ఈఎంఐలో పెద్ద తేడా ఉండదు.
ఒకవేళ నెలసరి వాయిదాల ఒత్తిడి తగ్గించుకోవాలంటే రుణ కాల పరిమితి పెంచుకోవడమే ఉత్తమమని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. ఆ అవకాశం లేకపోతే ఏవైనా ఎఫ్‌డీలు ఉంటే వాటిలో కొంత చెల్లించి ఉపశమనం పొందడమే మేలని సూచిస్తున్నారు.
Also Read: అనుకున్నదే! ఆర్బీఐ రెపోరేటు మరో 35 బేసిస్ పాయింట్లు పెంపు - 6.25 శాతానికి వడ్డీరేటు
Also Read: పొరపాటున వేరేవాళ్ల యూపీఐ ఐడీకి డబ్బు పంపించారా - ఇలా రికవరీ చేసుకోవచ్చు!