RBI Repo rate increased:  భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మరోసారి రెపోరేట్లు పెంచింది. 35 బేసిస్‌ పాయింట్ల మేర పెంచుతున్నామని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ బుధవారం పేర్కొంది. మొత్తంగా వడ్డీరేటును 6.25 శాతానికి చేర్చింది. పెంపు వెంటనే అమల్లోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ మీడియాకు వెల్లడించారు.


రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లను పెంచడం ఇదే మొదటి సారేమీ కాదు. మే నెలలో మొదటి సారి 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. జూన్‌, ఆగస్టు, సెప్టెంబర్లో వరుసగా 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో మొత్తంగా ఆర్బీఐ పాలసీ రేటు 2018, ఆగస్టు నాటి అత్యధిస్థాయి 6.25 శాతానికి చేరుకుంది.


Also Read: భారత ఆర్థిక వృద్ధి సూపర్‌ - అంచనా ప్రకటించిన ఫిచ్‌ రేటింగ్స్‌


Also Read: ఆర్బీఐ రేట్ల పెంపు - ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్‌, నిఫ్టీ


ద్రవ్యోల్బణం కట్టడికి రెపోరేటును 30 బేసిస్‌ పాయింట్ల మేర పెంచే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు ముందే అంచనా వేశాయి. అందుకు తగ్గట్టే మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక ఎస్డీఎఫ్‌ 6 శాతానికి సర్దుబాటు చేసింది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో భారత వృద్ధిరేటును 7 నుంచి 6.8 శాతానికి తగ్గించింది.


రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం మరీ ఎక్కువగా ఉందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం అద్భుతంగా పుంజుకుంటోందని స్పష్టం చేశారు. చీకట్లు అలుముకున్న ప్రపంచానికి భారత్‌ ఆశాదీపంగా కనిపిస్తోందని వెల్లడించారు. ధరల పెరుగుదలపై యుద్ధం ఇంకా ముగియలేదన్నారు. ఏప్రిల్‌-జూన్‌ 2023కు వినియోగ ధరల సూచీ ద్రవ్యోల్బణాన్ని 5.0 శాతంగా అంచనా వేశారు. జులై-సెప్టెంబర్‌ 2023లో సీపీఐ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉందన్నారు.


పెరుగుతున్న ధరలను బట్టే వడ్డీరేట్ల పెంపు, తగ్గింపు ఉంటాయని శక్తికాంతదాస్‌ అంటున్నారు. రాబోయే 12 నెలల్లో ద్రవ్యోల్బణం 4 శాతానికి పైగానే ఉంటుందని అంచనా వేశారు. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇప్పటికీ మిగులు లిక్విడిటీ ఉందన్నారు. రబీ ఉత్పత్తి సాధారణం కన్నా ఎక్కువగా 6.8 శాతంగా ఉందన్నారు. నవంబర్‌లో భారత తయారీరంగ వృద్ధిరేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని తెలిపారు. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల డిమాండ్‌ను గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక  కార్యకలాపాలు పెరుగుదలకు సంకేతమని వివరించారు.