UPI Transactions:
డిజిటల్ పేమెంట్లలో భారత్ తిరుగులేని రికార్డులు సృష్టిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయి. 2022లో గ్రామీణ, చిన్న పట్టణాల్లోని దుకాణాల్లో యూపీఐ లావాదేవీలు 650 శాతం పెరిగాయని ఓ నివేదిక వెల్లడించింది. విలువ పరంగా 25 శాతం, పరిమాణం పరంగా 14 శాతం వృద్ధిరేటు నమోదైందని బ్రాంచ్‌లెస్ బ్యాంకింగ్, డిజిటల్ నెట్‌వర్క్ పే నియర్‌బై తెలిపింది.
గ్రామీణ, చిన్న చిన్న పట్టణాల్లో అసిస్టెడ్ ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్ విపరీతంగా పెరిగాయని పే నియర్‌బై రిపోర్టు పేర్కొంది. ఇక మైక్రో ఏటీఎంలు, ఎంపీవోఎస్ పరికరాల డిమాండ్ 25 శాతం ఎగిసిందని వెల్లడించింది. ఆర్థిక సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీల్లో నెలసరి వాయిదాల వసూళ్లు (ఈఎంఐ) 200 శాతం వృద్ధి చెందాయని వివరించింది. కాగా నగదు ఉపసంహరణలో స్వల్ప తగ్గుదల కనిపించిందని తెలిపింది. 2021లో సగటున రూ.2620 నగదు విత్‌డ్రా చేయగా 2022లో అది రూ.2595కు తగ్గింది.
'భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అసిస్టెడ్ కామర్స్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, మైక్రో లెండింగ్ వాలిడేషన్ల వంటి గ్రీన్‌షూట్ సేవలు విపరీతంగా పెరిగాయి. ఈ వృద్ధిరేటు దగ్గర్లోని స్టోర్లలో మేం సులభ సేవలు అందించేందుకు అంకితమయ్యేలా చేస్తోంది' అని పే నియర్‌బై ఎండీ, సీఈవో ఆనంద్ కుమార్ బజాజ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది బ్యాంకింగ్, లైఫ్‌స్టైల్ అవసరాల కోసం అసిస్టెడ్ డిజిటల్ సేవలకు వేగంగా అలవాటు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ అవసరాలు మరింత పెరిగాయన్నారు.
నెలకు సగటున రూ.1400 కోట్ల మేర నెలసరి వాయిదాల వసూళ్లు (EMI Collections) జరుగుతున్నాయని ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. వసూళ్ల వృద్ధిరేటు 200 శాతంగా ఉందని వెల్లడించారు. ఇవన్నీ కొవిడ్ ముందు నాటి స్థాయికి ఆర్థిక కార్యకలాపాలు చేరుతున్నాయనేందుకు సంకేతాలని వివరించారు. 'ఈ ఏడాది తొలి 10 నెలల్లో మేం రూ.70,000 కోట్ల విలువైన డిజిటల్ సేవలు అందించాం. నగదు ఉపసంహరణ వ్యాపారం నిలకడగా వృద్ధి నమోదు చేస్తోంది. యూపీఐ లావాదేవీలు, ఆన్‌లైన్ చెల్లింపులు ఇతర ఆర్థిక సేవలకు ప్రజలు వేగంగా అలవాటు పడుతున్నారు. ఎకానమీ కొవిడ్ ముందు నాటి స్థాయికి చేరుకుంటోంది' అని ఆయన తెలిపారు.
ఒక లావాదేవీకి ఎంత ఖర్చు?
ఇప్పుడంతా బాగానే ఉంది! ప్రజలు సునాయాసంగా యూపీఐ లావాదేవీలు చేపడుతున్న తరుణంలో ఆర్బీఐ ఛార్జీల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తోందనేదే అసలు సందేహం! ఒక యూపీఐ లావాదేవీకి అసలెంత ఖర్చు అవుతుంది? చెల్లింపుల వ్యవస్థలో ఎవరికి ఎంత భారం పడుతోంది? అన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఒక లావాదేవీ జరగాలంటే నగదు పంపిస్తున్న బ్యాంకు, పొందుతున్న వారి బ్యాంకు, మధ్యవర్తి (ఫోన్ పే, పేటీఎం etc), ఎన్‌పీసీఐ సహకారం అవసరం. ఉదాహరణకు ఓ స్టోర్లో మీరు రూ.800 సరుకులు కొన్నారు. ఆ మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించారని అనుకుందాం. అప్పుడు డబ్బు చెల్లిస్తున్న వారి బ్యాంకుకు 80 పైసలు, లబ్ధిదారుడి బ్యాంకు, లబ్ధిదారుడి యూపీఐ యాప్ ప్రొవైడర్, పీఎస్‌పీ బ్యాంకుకు మొత్తంగా 56 పైసలు, చెల్లిస్తున్న వారి యూపీఐ యాప్ ప్రొవైడర్, పీఎస్‌పీ బ్యాంకుకు 48 పైసలు, ఎన్‌పీసీఐకి 16 పైసలు ఖర్చవుతాయి. అంటే రూ.800 లావాదేవీకి రూ.2 ఖర్చవుతుంది. ఇప్పుడున్న మొత్తం లావాదేవీలను చూసుకుంటే నెలకు రూ.1250 కోట్ల వరకు ఖర్చవుతుంది.
Also Read: క్రెడిట్ కార్డ్ ఇంటి దగ్గరే ఉన్నా మర్చంట్ వద్ద పేమెంట్ చేయొచ్చు ఇలా!
Also Read: ఇంటర్నెట్ లేకుండా UPI పేమెంట్స్ చేసే ట్రిక్, మీరూ ట్రై చేయండి