MCD Election Results: దిల్లీ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం 8 గంటలకు మొదలైంది. ఎర్లీ ట్రెండ్స్‌లో అధికార పార్టీ ఆమ్‌ఆద్మీ, భాజపా మధ్య నువ్వానేనా అన్నట్లు ఫలితాలు కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్ పార్టీ కొంత లీడ్ సాధించింది. మొత్తం 250 వార్డుల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ మాత్రం మరోసారి నిరాశపరిచింది.
గెలుపు మాదే
ఎర్లీ ట్రెండ్స్ చూసి ఆమ్‌ఆద్మీ పార్టీ మాత్రం ధీమా వ్యక్తం చేస్తోంది. తమ పార్టీ 180 సీట్లు గెలుస్తుందని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ పార్టీ నుంచే మేయర్ ఎన్నికవుతారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం కాబోతున్నాయన్నారు.
భారీ భద్రత
మొత్తం 250 వార్డులకు ఈ నెల 4న ఎన్నికలు జరిగాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్రులు కలిపి మొత్తం 1349 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 10 వేల మంది దిల్లీ పోలీసులను అక్కడ మోహరించారు.
ఎగ్జిట్ పోల్
అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్ సర్వేలు MCD పీఠం ఆప్‌దేనని స్పష్టం చేశాయి. 15 ఏళ్లుగా భాజపా చేతిలోనే ఉన్న్ MCDని ఈసారి ఆప్ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశాయి. 250 వార్డులకు గాను ఆప్ 155 వార్డుల్లో విజయం సాధిస్తుందని సర్వేలు తేల్చాయి.
అంతకుముందు దిల్లీని శుభ్రం చేసేందుకు ఆమ్‌ఆద్మీకి ఓ అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ ప్రజలను కోరారు. పోలింగ్ సందర్భంగా కేజ్రీవాల్ ఈ విజ్ఞప్తి చేశారు.