Fitch Ratings - India GDP: భారత ఆర్థిక వృద్ధి గాడిన పడింది. మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వివిధ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు, ఆర్థిక పరిశోధన సంస్థలు విడుదల చేస్తున్న అంచనాలు సంతృప్తికరంగా కనిపిస్తున్నాయి. 


గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ (Fitch Ratings) భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాను మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23 లేదా FY23) భారత దేశం 7% ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని ఆ సంస్థ వెల్లడించింది. ఆర్థిక మాంద్యం (రెసిషన్‌) భయంతో, అభివృద్ధి చెందిన దేశాలు గజగజలాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో 7% వృద్ధి అన్నది ఆర్థిక దృఢత్వానికి గుర్తుగా చూడాలి.


ప్రపంచ ప్రతికూల పరిణామాలు మన దేశం మీద పెద్దగా ప్రభావం చూపవని చెబుతూనే, వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలకు భారత దేశ ఆర్థిక వృద్ధి అంచనాలను ఫిచ్‌ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయ ఉత్పత్తి ‍(Gross Domestic Production - GDP‌) 7 శాతానికి పెరుగుతుందని, 2023-24లో (FY24) 6.2 శాతంతో నెమ్మదిస్తుందని, 2024-25లో (FY25) కాస్త పుంజుకుని మళ్లీ 6.9 శాతానికి చేరుతుందని గ్లోబల్ ఎకనామిక్ ఔట్‌లుక్‌ (Global Economic Outlook) డిసెంబర్ ఎడిషన్‌లో ఫిచ్‌ అంచనా వేసింది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని సెప్టెంబర్‌ ఎడిషన్‌లో ఫిచ్ అంచనా వేసింది. ఆ తర్వాత, 2023-24 లో 6.7 శాతం & 2024-25 లో 7.1 శాతం వృద్ధిని అంచనా వేస్తూ గణాంకాలు విడుదల వేసింది. ఈ ఏడాది జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయ ఉత్పత్తి వృద్ధి 6.3 శాతంగా నమోదై, ఊహించిన దాని కంటే బలంగా ఉంది. ఈ నేపథ్యంలో, తన అంచనాలను ఈ సంస్థ సవరించింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో (ఎమర్జింగ్‌ మార్కెట్స్‌) అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఒకటని ఫిచ్‌ తెలిపింది. 


ప్రపంచ బ్యాంక్‌ అంచనా
కీలక అంతర్జాతీయ సంస్థ అయిన ప్రపంచ బ్యాంక్ (World Bank) కూడా, భారత ఆర్థిక వ్యవస్థ మీద మంగళవారం తన అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించి, భారత GDP వృద్ధి అంచనాను 6.9 శాతానికి పెంచింది. ప్రపంచ ప్రతికూల పరిణామాల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. GDP వృద్ధి రేటును ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు తగ్గించింది ప్రపంచ బ్యాంకు. దేశ స్థూల ఉత్పత్తి వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని ఈ ఏడాది అక్టోబర్‌లో అంచనా వేసింది. దీని కంటే ముందు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాను 7.5 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించింది. కరోనా సంబంధింత ఇబ్బందులు, ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం ప్రభావం ఇందుకు కారణం. తాజాగా, వృద్ధి రేటు అంచనాను మళ్లీ 6.9 శాతానికి పెంచింది. రెండో త్రైమాసికంలో (2022 జులై- సెప్టెంబర్‌ కాలం) GDP గణాంకాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉన్నాయని పేర్కొంది. దీని కారణంగా మొత్తం ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను పెంచుతున్నట్లు తెలిపింది.


ఇతర సంస్థల అంచనాలు
ఈ ఏడాది నవంబర్ రెండో వారంలో, మూడీస్ (Moody’s) కూడా 2022కి భారత GDP వృద్ధి అంచనాను మునుపటి అంచనా 7.7% నుంచి 7%కు తగ్గించింది. నవంబర్ 27న, రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ & పూర్ (Standard & Poor) తన అంచనాను గత అంచనా 7.3% నుంచి 7%కు తగ్గించింది. క్రిసిల్‌ (CRISIL) కూడా 7.3% నుంచి 7%కు తగ్గించింది.