FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్ లో సంచలనాలు ఆగడం లేదు. గ్రూప్ దశలో ఆశ్చర్యకర ఫలితాలతో విస్మయపరిచిన చిన్నజట్లు... నాకౌట్ లోనూ చెలరేగుతున్నాయి. గ్రూప్ దశలో తమది గాలివాటం గెలుపు కాదని రుజువు చేస్తూ పసికూన మొరాకో జట్టు.. మాజీ ఛాంపియన్ స్పెయిన్ ను మట్టికరిపించింది. పెనాల్టీ షూటౌట్ లో 3-0 తేడాతో స్పెయిన్ ను ఓడించిన మొరాకో సగర్వంగా క్వార్టర్స్ లో అడుగుపెట్టింది.
ఫుట్ బాల్ ప్రపంచకప్ లో నాకౌట్ దశలోనూ సంచలనాలు నమోదవుతున్నాయి. స్పెయిన్ ముందు పసికూన లాంటి మొరాకో.. మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించి తొలిసారి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కేవలం ఆరోసారి మాత్రమే ప్రపంచకప్ ఆడుతూ, ఎప్పుడో 36 ఏళ్ల కిందట ఒకసారి నాకౌట్ ఆడిన చరిత్ర ఉన్న మొరాకో.. మంగళవారం అంచనాలకు అందని ఆటతో స్పెయిన్‌కు కళ్లెం వేసింది.
స్పెయిన్ కొంపముంచిన రక్షణాత్మక ఆట
మ్యాచులో ఎక్కువ భాగం బంతి స్పెయిన్ నియంత్రణలోనే ఉంది. మొరాకోతో పోలిస్తే మూడు రెట్లకు పైగా పాసులు అందించుకున్నారు. అయితే రక్షణాత్మకంగా ఆడడం ఆ జట్టు కొంప ముంచింది. పోరాడితో పోయేదేముందన్నట్లు ఆడిన మొరాకో... స్పెయిన్ ను ఓడించి క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. మంగళవారం నిర్ణీత 90 నిమిషాల్లో, ఇంజురీ టైంలో, అదనపు సమయంలో ఇరు జట్లూ గోల్ చేయలేకపోయాయి. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు వెళ్లింది. అందులో అనూహ్యంగా 3-0తో విజయం సాధించింది మొరాకో. ఆ జట్టు ఆటగాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో షూటౌట్‌ను ఎదుర్కొన్నారు. స్పెయిన్ ఆటగాళ్లు మాత్రం భయం భయంగా షాట్లు ఆడి జట్టు కొంప ముంచారు. మొరాకో గోల్‌కీపర్ యాసిన్ బౌనౌ అడ్డుగోడగా నిలబడి స్పెయిన్ ను గోల్ చేయనివ్వలేదు. ఈ ప్రదర్శనతో అతను ఆ దేశ హీరోగా నిలిచాడు. మొరాకో 1986లో ఒక్కసారే ప్రిక్వార్టర్స్ ఆడింది. ఇప్పుడు మళ్లీ నాకౌట్ ఆడుతున్నామన్న ఆనందం ఆ దేశ ఆటగాళ్లు, అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.
షూటౌట్ జరిగిందిలా...
గ్రూప్ దశలో మొరాకో చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ.. స్పెయిన్ ముందు ఆ జట్టు నిలుస్తుందా అన్న సందేహాలు వినిపించాయి. అయితే మొరాకోతో అంత తేలిక కాదని స్పెయిన్‌కు త్వరగానే అర్థమైంది. నిర్ణీత సమయంలో ఆ జట్టును గోల్ చేయనీవకుండా మొరాకో ఆటగాళ్లు అడ్డుకున్నారు. స్పెయిన్ గోల్ కొట్టేందుకు 2 ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు. రెండో అర్ధంలో స్పెయిన్ కొంచెం దూకుడు పెంచినా లాభం లేకపోయింది. మొరాకో కూడా అంతే దీటుగా స్పందించింది. ఇంజురీ టైం, అదనపు సమయంలోనూ గోల్స్ నమోదు కాకపోవడంతో షూటౌట్ అనివార్యం అయింది.
అయితే షూటౌట్లలో స్పెయిన్‌కు సరైన రికార్డు లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన తప్పలేదు. ఆ జట్టు ఆటగాళ్లలోనూ అది ప్రతిఫలించింది. సబిరి సునాయాసంగా గోల్ కొట్టి మొరాకోను 1-0 ఆధిక్యంలో నిలపగా.. పాబ్లో సరాబియా షాట్ గోల్ బార్‌ను తాకడంతో స్పెయిన్‌కు ఆరంభంలోనే నిరాశ తప్పలేదు. హకీమ్ జియెచ్ నెట్ మధ్యలోకి షాట్ ఆడిన షాట్‌తో మొరాకో 2-0 ఆధిక్యంలోకి వెళ్లగా.. కార్లోస్ సోలెర్ షాట్‌ను యాసిన్ సరిగ్గా అంచనా వేసి ఆపేయడంతో స్పెయిన్‌కు మళ్లీ షాక్ తగిలింది. బెనౌన్ షాట్‌ను సైమన్ ఆపడంతో స్పెయిన్ ఆశలు నిలిచాయి. కానీ ఆ జట్టు కెప్టెన్ సెర్జియో కొట్టిన షాట్‌ను కుడివైపు దూకుతూ యాసిన్ ఆపేయడంతో మొరాకో విజయానికి చేరువ అయింది. తమ జట్టు నాలుగో ప్రయత్నాన్ని విజయవంతం చేస్తూ హకిమి గోల్ కొట్టడంతో మొరాకో సంబరాలకు అంతే లేకుండా పోయింది. స్పెయిన్ శిబిరం కన్నీళ్లతో నిండిపోయింది.