PM Nari Sakshti Yojana: దేశంలోని మహిళల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగు పరచడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను రూపొందిస్తూ, ప్రచారం చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పథకానికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. మహిళల స్వావలంబన కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించిందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ఆ వీడియోలో చెబుతున్న పథకం పేరు 'ప్రధాన్ మంత్రి నారీ శక్తి యోజన' (PM Nari Shakti Yojana). ఈ పథకం, కేంద్ర ప్రభుత్వం కింద ప్రతి మహిళకు 2 లక్షల 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుంది. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.


'ఇండియన్ జాబ్' యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా..
'ఇండియన్ జాబ్' అనే పేరుతో నడుస్తున్న యూట్యూబ్ ఛానెల్‌ ద్వారా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలోని మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ఆర్థిక సాయం అందజేస్తుందని ఈ వీడియోలోని వివరాల ద్వారా తెలుస్తోంది. అయితే, ఆ పథకం నిజం కాదంటోంది కేంద్ర ప్రభుత్వం. సోషల్‌ మీడియా ద్వారా మీ ఫోన్‌లోకి కూడా ఈ వీడియో వచ్చే ఉండొచ్చు, లేదా త్వరలోనే రావచ్చు. ఈ పరిస్థితుల్లో, అసలు నిజమేంటో మనం తెలుసుకుందాం.


నిజ నిర్ధరణ
ఈ వైరల్ వీడియోలో నిజానిజాలు తెలుసుకునేందుకు, కేంద్ర ప్రభుత్వ నోడల్‌ ఏజెన్సీ అయిన 'ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో' (PIB) రంగంలోకి దిగింది, ఫ్యాక్ట్ చెక్ చేసింది. 'ప్రధాన్ మంత్రి నారి శక్తి యోజన' పేరుతో మోదీ ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రారంభించలేదని తన నిజ నిర్ధరణ తనిఖీలో PIB వెల్లడించింది. వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా ఫేక్ అని, 'ఇండియన్ జాబ్' ఛానెల్‌ చేస్తున్న ప్రచారం తప్పు అని తేల్చి చెప్పింది.


ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దు
సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులు ఇలాంటి నకిలీ పథకాలను సృష్టించడం ద్వారా ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ సమాచారంతో, ప్రజల బ్యాంక్‌ ఖాతాల్లోని కష్టార్జితాన్ని ఆ సైబర్‌ నేరగాళ్లు ఖాళీ చేస్తారు. కాబట్టి ఇలాంటి తప్పుడు వార్తలను అస్సలు నమ్మొద్దు. ఏదైనా పథకం గురించి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలంటే, దాని అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 


ఏదైనా ప్రభుత్వ పథకం లేదా కార్యక్రమానికి సంబంధించి మీకు ఏదైనా మెసేజ్ ఏదైనా వస్తే, దానిలో నిజమెంతో తెలుసుకోవడానికి మీరు ఫాక్ట్ చెక్ చేయవచ్చు. PIB ద్వారా వాస్తవాన్ని నిర్ధరించుకోవచ్చు. దీని కోసం, అధికారిక లింక్ https://factcheck.pib.gov.in/ని సందర్శించవచ్చు. ఇది కాకుండా.. వాట్సాప్ నంబర్ +91 8799 711 259 కు మెసేజ్‌ చేయవచ్చు. లేదా, pibfactcheck@gmail.com కి ఈ-మెయిల్ పంపవచ్చు.