Minors bank accounts: చిన్న పిల్లలు బ్యాంక్ ఖాతాలు నిర్వహించే విషయంపై ఇప్పటి వరకూ ఉన్న ఆంక్షలను ఆర్బీఐ సడలించింది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్లు స్వతంత్ర బ్యాంకు ఖాతాలను తెరవవచ్చని.. సొంతంగా నిర్వహించుకోవచ్చని సోమవారం ప్రకటించింది. పది ఏళ్లు దాటిన మైనర్లు స్వతంత్రంగా పొదుపు బ్యాంకు ఖాతాను, టర్మ్ డిపాజిట్ ఖాతాలను ఓపెన్ చేయవచ్చు. వారే నిర్వహించుకోవచ్చు.
బ్యాంకులు తమ రిస్క్ మేనేజ్‌మెంట్ పాలసీని బట్టి పది ఏల్లు దాటిన మైనర్లు పొదుపు ఖాతాలకు పరిమితి విధించుకోవచ్చని ఆర్బీఐ తెలిపిది. నిబంధనల మేరకు మైనర్లు కోరుకుంటే, స్వతంత్రంగా పొదుపు/టర్మ్ డిపాజిట్ ఖాతాలను తెరవడానికి, నిర్వహించడానికి అనుమతించవచ్చు. అలాంటి సమయంలో నిబంధనలను ఖాతాదారునికి సక్రమంగా తెలియజేయాలి అని RBI సర్క్యులర్‌లో తెలిపింది. మైనర్లు మెజారిటీ వయస్సు వచ్చిన తర్వాత నమూనా సంతకాన్ని బ్యాంకు రికార్డుల్లో భద్రపరచాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకూ మైనర్లు బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేస్తే సహజ లేదా చట్టపరమైన సంరక్షకుడి ద్వారా చేయాల్సి ఉంటుంది. నిర్వహణ కూడా అంతే. అయితే అక్రమ లావాదేవీలు చేసే ఖాతాలను స్తంభింపజేయాలని బ్యాంకులు కోరుతున్నాయి. అందుకే ఇక్కడ బ్యాంకులు తమ రిస్క్ మేనేజ్‌మెంట్ విధానం ఆధారంగా మైనర్ ఖాతాలకు అదనపు బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడానికి కేంద్ర బ్యాంకు అనుమతించింది. బ్యాంకులు వారి రిస్క్ మేనేజ్‌మెంట్ విధానం ఇతర కారణాలతో మైనర్ ఖాతాదారులకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM/డెబిట్ కార్డులు, చెక్ బుక్ సౌకర్యం మొదలైన అదనపు బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడానికి అవకాశం ఉంది.
10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్లు కూడా వారి తల్లి సంరక్షకుడిగా అలాంటి బ్యాంకు ఖాతాలను తెరుచుకోవచ్చు. మైనర్లకు సంబంధించిన బ్యాంకు ఖాతా అది స్వతంత్రంగా లేదా సంరక్షకుడి ద్వారా నిర్వహిస్తున్నారా అనేది పరిశీలించాల్సి ఉంటుంది. బ్యాంకులు కూడా మైనర్ల డిపాజిట్ ఖాతాలను తెరవడానికి కస్టమర్ల కోసం డ్యూ డిలిజెన్స్ ప్రక్రియను నిర్వహించనుంది. జూలై 1, 2025 నాటికి సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొ విధానాలను సవరించాలని RBI బ్యాంకులను ఆదేశించింది.
పిల్లల అకౌంట్స్ పేరుతో జరుగుతున్న కొన్ని అవకతవకలతో పాటు ఇటీవలి కాలంలో పదేళ్లు దాటిన పిల్లలకు ఆర్థిక అక్షరాస్యత పెరుగుతోంది. వారికి ఆర్థికపరమైన విషయాలు, బ్యాంకింగ్ ఇతర అంశాలపై అవగాహన పెరగాలంటే.. తమ ఖాతాలను తాము నిర్వహించుకునే అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తులు ఆర్బీఐకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించేవారు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ మైనర్లకు బ్యాంకు ఖాతాలు వివిధ కారణాలతో అవసరం అయినప్పుడే తల్లిదండ్రులు ప్రారంభించేవారు.