పన్ను చెల్లింపు దారులకు ఆదాయపన్ను శాఖ మరో అప్‌డేట్‌ చెప్పింది. ఇక నుంచి ఒక అసెస్‌మెంట్‌ ఏడాదికి ఒకసారి తప్పులు, పొరపాట్లను సరిదిద్దిన రిటర్నులు దాఖలు చేసేందుకు అనుమతిస్తామని తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ (CBDT) బోర్డు ఛైర్మన్‌ జేబీ మహాపాత్రా సీఐఐ సదస్సులో విలేకరులకు ఈ విషయం చెప్పారు.


ఉద్దేశపూర్వకంగా కాకుండా కొన్నిసార్లు తెలియకుండానే పొరపాట్లు జరుగుతుంటాయని మహాపాత్రా అన్నారు. అలాంటి నిజాయతీ గల పన్ను చెల్లింపుదారులకు సాయం చేసేందుకే ఈ నిబంధన తీసుకొస్తున్నామని వెల్లడించారు. 'అలాంటివాళ్లు ఒక అసెస్‌మెంట్‌ ఏడాదిలో ఒకసారి అప్‌డేట్‌ చేసిన రిటర్న్‌ దాఖలు చేసేందుకు అనుమతి ఇస్తున్నాం' అని ఆయన వివరించారు. 


కొన్ని రోజుల క్రితమే ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇలాంటి ప్రకటనే చేసిన సంగతి తెలిసిందే. చెల్లించే పన్నులను బట్టి ఒక అసెస్‌మెంట్‌ ఏడాది పూర్తైన రెండేళ్ల వరకు తప్పులు, పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు.


అప్‌డేట్‌ చేసిన ఐటీఆర్‌ను 12 నెలల్లోపు దాఖలు చేస్తే బాకీపడ్డ పన్ను, వడ్డీలో 25 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పీటీఐ తెలిపింది. అదే 12 నుంచి 24 నెలల మధ్య దాఖలు చేస్తే ఆ మొత్తం 50 శాతానికి చేరుతుందని పేర్కొంది. ఒకవేళ ఒక అసెస్‌మెంట్‌ ఏడాదికి సంబంధించి విచారణ నోటీసులు పంపించినప్పుడు అప్‌డేటెడ్‌ రిటర్న్‌ ప్రయోజనాలు పొందలేరని తెలుస్తోంది. టాక్స్‌ పేయర్లు అప్‌డేట్‌ చేసిన రిటర్న్‌ దాఖలు చేసి అదనపు పన్నులు చెల్లించకపోతే ఆ రిటర్న్‌ను చెల్లనిదిగా పరిగణిస్తారు.


ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు ఏదైనా ఆదాయాన్ని రిటర్నులో చూపించనట్టు ఆదాయపన్ను శాఖ గుర్తిస్తే సుదీర్ఘమైన సవరింపుల ప్రక్రియ చేపట్టాల్సి వస్తోంది. కొత్త ప్రతిపాదన ద్వారా టాక్స్‌ పేయర్లలో విశ్వాసం పెరుగుతుందని ఐటీశాఖ భావిస్తోంది. బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఒక ఊరట కల్పించిన సంగతి తెలిసిందే! ఐటీ రిటర్నులు సమర్పించేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరిగినా మార్చుకొనేందుకు రెండేళ్ల సమయం ఇచ్చారు. అంటే అసెస్‌మెంట్‌ ఇయర్‌ నుంచి రెండేళ్ల వరకు అన్నమాట.


Also Read: ఐపీవో క్రేజ్‌ - పెట్టుబడి పెట్టే ముందు ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు రావు!


Also Read: ఈ షేరులో మీరు రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే 20 నెలల్లో రూ.18 లక్షలు సంపాదించేవారు!