Salary Account Rules: ఉద్యోగులందరికీ దాదాపుగా సాలరీ అకౌంట్‌ గురించి తెలిసే ఉంటుంది! ఏదైనా పెద్ద కంపెనీలో పనిచేస్తుంటే వారు చెప్పిన బ్యాంకులోనే ఉద్యోగులు సాలరీ అకౌంట్‌ తీయాల్సి ఉంటుంది. ప్రతి నెలా యజమాని అందులోనే వేతనాలు జమ చేస్తారు. మన ఆర్థిక అవసరాలకు అదెంతో అవసరం! అందుకే సాలరీ అకౌంట్‌ నిర్వహణ నిబంధనలు, ప్రయోజనాలు తెలుసుకోవడం అంతకన్నా ముఖ్యం.


కనీస నిల్వ ఎంత?


నిజానికి సాలరీ అకౌంట్‌లో కనీస నిల్వ అవసరం లేదు. డబ్బులు పూర్తిగా ఖర్చు పెట్టుకున్నా ఎలాంటి జరిమానా విధించరు. కొన్ని సార్లు ఉద్యోగులు కంపెనీలు మారుతుంటారు. అలాంటప్పుడు పాత కంపెనీ కోసం తీసిన సాలరీ అకౌంట్‌కు సంబంధించి ఒక నిబంధన  తెలుసుకోవడం ముఖ్యం. ఆ పాత ఖాతాలో మూడు నెలలు వరుసగా వేతనం జమ కాకపోతే దానిని సేవింగ్స్‌ ఖాతా కిందకు మార్చేస్తారు. అప్పుడు సాధారణ ఖాతా నియమాలే దానికీ వర్తిస్తాయి. బ్యాంకును బట్టి కనీస నిల్వ జమ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రైవేటు బ్యాంకుల్లో కనీసం రూ.10,000 వరకు మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంది. అదే కాకుండా ఇతర సేవలకు రుసుములు చెల్లించాల్సి వస్తుంది.


ప్రయోజనాలేంటి?


సాలరీ ఖాతాల ద్వారా ప్రయోజనాలూ బాగానే ఉంటాయి. వ్యక్తిగత చెక్‌ బుక్‌ లభిస్తుంది. ప్రతి చెక్‌ పైనా ఉద్యోగి పేరు ముద్రించి ఇస్తారు. ఇక మీ సాలరీ అకౌంట్‌ను ఫోన్‌ లేదా ఇంటర్నెట్‌ ద్వారా యాక్సెస్‌ చేసుకోవచ్చు. డిపాజిట్‌ లాకర్‌, సూపర్‌ సేవర్‌ ఫెసిలిటీ, ఉచిత ఇన్‌స్టా అలర్టులు, ఉచిత పాస్‌బుక్‌, ఉచిత ఈమెయిల్‌ స్టేట్‌మెంట్‌ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. సాలరీ అకౌంట్‌ ద్వారా ఇంకా మరెన్నో సేవలనూ పొందొచ్చు.


Also Read: ఐపీవో క్రేజ్‌ - పెట్టుబడి పెట్టే ముందు ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు రావు!


Also Read: ఈ షేరులో మీరు రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే 20 నెలల్లో రూ.18 లక్షలు సంపాదించేవారు!