పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కస్టమర్లకు షాకిచ్చింది! సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీరేట్లలో కోత పెట్టింది. తగ్గించిన వడ్డీరేట్లు 2022, ఫిబ్రవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఓ వైపు కస్టమర్లు ఎక్కువ వడ్డీరేట్లను ఆశిస్తోంటే బ్యాంకులేమో కోత పెడుతున్నాయి.


గతంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రూ.10 లక్షల లోపు నగదు నిల్వ ఉండే సేవింగ్స్‌ ఖాతాలపై 2.80 శాతం వడ్డీని ఇచ్చేది. రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్లు ఉండే సేవింగ్స్‌ ఖాతాలపై 2.85 శాతం వడ్డీని జమ చేసేది. కానీ ఫిబ్రవరి 3 నుంచి ఈ ఖాతాలపై 5 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీని సవరించింది.


అంటే ఇప్పుడు రూ.10 లక్షల లోపు ఖాతాలపై 2.75 శాతం, రూ.10 లక్షలకు పైన ఉండే ఖాతాలపై 2.80 శాతం వడ్డీనే పీఎన్‌బీ ఇవ్వనుంది. ఇక రూ.500 కోట్లకు పైగా నిల్వ ఉండే సేవింగ్స్‌ ఖాతాలపై 3.25 శాతం వడ్డీ ఇస్తోంది. సవరించిన వడ్డీరేట్లు దేశీయ, ఎన్‌ఆర్‌ఐ ఖాతాలకూ వర్తిస్తాయి.


ఫిబ్రవరిలోనే ప్రైవేటు రంగ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌బీఎల్‌ బ్యాంకులు సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీరేట్లను సవరించిన సంగతి తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు దేశీయ, ఎన్‌ఆర్‌వో, ఎన్‌ఆర్ఈ సేవింగ్స్‌ ఖాతాలపై సవరించిన వడ్డీరేట్లను 2022, ఫిబ్రవరి 2 నుంచి అమలు చేస్తోంది. ఇక ఆర్‌బీఎల్‌ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలతో పాటు ఫిక్స్‌డ్‌, రికరింగ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను అమలు చేస్తోంది. పంజాబ్‌, సింధ్‌ బ్యాంకు సైతం సేవింగ్స్ ఖాతాలపై వడ్డీరేట్లను సవరించడం గమనార్హం.


Also Read: LIC offers: కస్టమర్లకు ఎల్‌ఐసీ ఆఫర్‌- ఆలస్య రుసుములో భారీ రాయితీ


Also Read: SBI Q3 Results: ఎస్‌బీఐ బంపర్‌ ప్రాఫిట్‌! మార్కెట్‌ అంచనాలు బీట్‌ చేసిన బ్యాంకు