భారతీయ స్టేట్ బ్యాంకు త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. వార్షిక ప్రాతిపదికన స్టాండలోన్ నికర లాభంలో 62.26 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలోని రూ.5,196 కోట్లతో పోలిస్తే ఇప్పుడు రూ.8,431 కోట్ల లాభం ఆర్జించింది. మార్కెట్ వర్గాలు అంచనా వేసిన రూ.8,200 కోట్ల కన్నా ఇది ఎక్కువే కావడం గమనార్హం.
ఈ త్రైమాసికంలో వడ్డీ ఆదాయం 4.41 శాతం పెరిగింది. గతేడాది రూ.66,734 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.69,678 కోట్లు నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం (NII) రూ.28,820తో పోలిస్తే 6.48 శాతం పెరిగి రూ.30,687 కోట్లుగా ఉంది. గతేడాది 3.34 శాతంతో పోలిస్తే ఈ సారి నికర వడ్డీ మార్జిన్ 6 బేసిస్ పాయింట్లు పెరిగి 3.4 శాతానికి చేరుకుంది.
ఇక డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో స్లిప్పేజెస్ రూ.2,334 కోట్లుగా ఉంది. కొవిడ్ రిజల్యూషన్ ప్లాన్ 1, 2 కింద రూ.32,895 కోట్లు ఉన్నాయి. ఇంటి రుణాలు, ఎక్స్‌ప్రెస్ క్రెడిట్, ఇతరు రుణాల పెరుగుదలతో వ్యక్తిగత రిటైల్ సెగ్మెంట్‌లో వృద్ధి కనిపించిందని ఎస్‌బీఐ తెలిపింది. తాజా త్రైమాసికంలో కార్పొరేట్, ఎస్‌ఎంఈ రుణాలూ పెరిగాయని వెల్లడించింది.
వార్షిక ప్రాతిపదికన ఈ త్రైమాసికంలో డిపాజిట్లు 8.83 శాతం పెరిగి రూ.38,47,794 కోట్లుగా ఉన్నాయి. గ్రాస్ అడ్వాన్సులు 8.47 శాతం పెరిగి రూ.26,64,602 కోట్లు ఉన్నాయి. రిటైల్ పర్సనల్ అడ్వాన్సులు 14.57 శాతం పెరిగి రూ.9,52,189 లక్షలుగా ఉన్నాయి. సెప్టెంబర్ క్వార్టర్లో 4.9 శాతం ఉన్న గ్రాస్ ఎన్‌పీఏ ఇప్పుడు 4.5 శాతానికి తగ్గాయి. వడ్డీయేతర ఆదాయం మాత్రం 6.19 శాతం తగ్గి రూ.9,246 కోట్ల నుంచి రూ.8,673 కోట్లుగా ఉంది. విదేశీ మారక ద్రవ్యం సైతం 21 శాతం తగ్గింది.
Also Read: Tata Steel Q3 Net Profit: టాటా స్టీల్! ఉక్కు కన్నా గట్టిగానే లాభాలు!
Also Read: Tata Nexon EV: అదిరిపోయే కొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు.. లాంచ్ త్వరలోనే.. ఒక్కచార్జ్‌తో 500 కిలోమీటర్లు!