By: ABP Desam | Updated at : 18 Apr 2023 03:16 PM (IST)
ఇల్లు కొనడం, అద్దెకు ఉండడం - ఏది ప్రయోజనం?
Buying Vs Renting: ఒక ఇంటిని సొంతం చేసుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయి. పదే పదే ఇల్లు మారడం మొదలు చాలా రకాల సమస్యల నుంచి విముక్తిని ప్రసాదిస్తుంది. దీంతోపాటు శాశ్వత చిరునామా, మానసిక ప్రశాంతత, భద్రతను అందిస్తుంది. అయితే, ఆర్థిక పరంగా చూస్తే ఇల్లు కొనడం కంటే అద్దె ఇంట్లో ఉండటమే మేలు అని వాదించే వారికి కూడా కొదవ లేదు. EMI కంటే అద్దె మొత్తం తక్కువని, మిగిలిన మొత్తాన్ని క్రమమైన పెట్టుబడిగా మార్చుకోవచ్చని అలాంటి వాళ్లు వాదిస్తారు.
ఇలా చర్చించుకుంటూ పోతే ఇది సుదీర్ఘ చర్చకు దారి తీస్తుంది. సొంత ఇంటికి, అద్దె ఇంటికి దేని ప్రయోజనాలు, అప్రయోజనాలు దానికి ఉన్నాయి. ఈ రెండు ఆప్షన్లలో లాభనష్టాలు ఏంటో తెలుసుకుంటే.. ఎవరికి అనుకూలమైన విధానాన్ని వాళ్లు అనుసరించవచ్చు.
గృహ రుణం ఖరీదుగా మారింది
ముందుగా, ఇల్లు కొనే విషయానికి వద్దాం. కొత్త ఇల్లు కొనుక్కోవడానికి సరిపడా డబ్బు ఉన్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది లోన్ తీసుకుని మాత్రమే ఇల్లు కొనగలరు. గృహ రుణానికి రెపో రేటుతో నేరుగా అనుసంధానం ఉంటుంది. రెపో రేటు పెరగడం వల్ల రుణ వ్యయం పెరుగుతుంది. 2022 మే నెల నుంచి ఇప్పటి వరకు, రిజర్వ్ బ్యాంక్ (RBI) తన రెపో రేటును రెండున్నర శాతం పెంచింది. ఈ కారణంగా, గతంలో 6.5 శాతంగా ఉన్న గృహ రుణ రేట్లు ఇప్పుడు 9 శాతానికి పైగా ఉన్నాయి. అయితే, ఈ నెల ప్రారంభంలోని ద్రవ్య విధానంలో, రెపో రేటును RBI మార్చలేదు, 6.5 శాతం వద్దే కొనసాగించింది. ఈ నేపథ్యంలో, వడ్డీ రేట్లలో తదుపరి పెరుగుదల ఉండకపోవచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి.
దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI గృహ రుణ రేట్లు ప్రస్తుతం 9.15 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. మీరు కొనాలనుకుంటున్న ఇంటి ధర రూ. 50 లక్షలు అనుకుందాం. ఏ నగరంలోనైనా మంచి ప్రదేశంలో 3BHK అపార్ట్‌మెంట్ ధర దీని దరిదాపుల్లోనే ఉంటుంది. మీ జేబులోంచి 20% డౌన్‌పేమెంట్ చేసి, 80% అంటే రూ. 40 లక్షల హోమ్ లోన్ తీసుకోబోతున్నారని అనుకుందాం. 20 సంవత్సరాలకు 9.15 శాతం చొప్పున రూ. 40 లక్షల రుణం తీసుకుంటే, దాని నెలవారీ EMI రూ. 36,376 అవుతుంది. ఈ ప్రకారం మీరు 20 ఏళ్లలో రూ. 87 లక్షల 30 వేల 197 బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అసలు రూ. 40 లక్షలు కాగా, మిగిలిన రూ. 47 లక్షలు వడ్డీ. అంటే 20 ఏళ్ల తర్వాత ఈ ఇంటికి దాదాపు కోటి రూపాయలు ఖర్చవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వార్షిక వృద్ధి రేటు 5-6 శాతం. ఈ రకంగా చూస్తే ఈరోజు రూ. 50 లక్షలు ఉన్న ఇంటి ధర 20 ఏళ్ల తర్వాత రూ. 1.3 - 1.6 కోట్లకు చేరుతుంది.
అద్దె గణితం
ఇప్పుడు అద్దె ఇంటి గురించి మాట్లాడుకుందాం. రూ. 50 లక్షల విలువైన ఇంట్లో నివసించాలంటే నెలకు దాదాపు రూ. 20,000 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఆ ఇంటిని అద్దెకు తీసుకుంటే, ప్రతి నెల రూ. 16,376 ఆదా అవుతుంది. SIP ద్వారా ఈ డబ్బును మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, 12% రాబడి అంచనాతో 20 సంవత్సరాల తర్వాత రూ. 1 కోటి 58 లక్షలు పొందుతారు. డౌన్‌పేమెంట్ రూ.10 లక్షలను విడిగా ఒకేసారి పెట్టుబడి పెట్టడం ద్వారా మొత్తం రూ. 96 లక్షల 46 వేల 293 అందుతుంది. అంటే, 20 సంవత్సరాల తర్వాత మీకు రెండున్నర కోట్ల రూపాయల కంటే ఎక్కువ వస్తుంది. దీనిని బట్టి అద్దెకు ఉండడం మంచి ఎంపిక.
అద్దె ఇంట్లో ఉండడం వల్ల ప్రయోజనాలు
EMI కంటే తక్కువ మొత్తంతో అద్దె ఇంట్లో ఉండవచ్చు. డౌన్ పేమెంట్ అక్కర్లేదు. మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకున్నా, లేదా ఇంటి లొకేషన్ నచ్చకపోతే మీ ఇంటిని సులభంగా మార్చుకోవచ్చు.
ఇల్లు కొనడం వల్ల ప్రయోజనాలు
EMI చెల్లించడం ద్వారా, మీరు ఒక ఆస్తిని సృష్టిస్తారు. 80C కింద హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్‌పై రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు, సెక్షన్ 24 కింద వడ్డీపై మరో రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది.
అద్దె ఇంటి ప్రతికూలతలు
మీరు అద్దెకు చెల్లిస్తున్న డబ్బుకు తిరిగి రాదు. లేదు. ప్రతి ఏడాది అద్దె 8 నుంచి 10 శాతం పెరుగుతుంది. ఇంటి యజమాని అనుమతి లేకుండా మీరు ఇంట్లో ఏ పనిని పూర్తి చేయలేరు. మీకు నచ్చకపోయినా, ఇంటి యజమానికి నచ్చకపోయినా మీరే ఇల్లు మారాలి. ఎక్కువసార్లు రవాణాలో ఉంటే గృహోపకరాణాలు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. పైగా, ఇల్లు మారడం అంటే ఆర్థికంగా, మానసికంగా చాలా ఇబ్బందికర పరిణామం.
సొంత ఇంటి ప్రతికూలతలు
డౌన్‌పేమెంట్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, EMI వంటి ఖర్చులు భరించవలసి ఉంటుంది. లొకేషన్ మీకు నచ్చకపోయినా, డబ్బు అవసరమైనా ఆ ఇంటిని త్వరగా అమ్మలేరు.
PSUs Dividend: 90 పీఎస్‌యూలు.. లక్ష కోట్ల డివిడెండ్ - వీరికి జాక్‌పాట్!
Government Saving Schemes: ప్రతి 3 నెలలకు రూ.60వేలు వడ్డీ ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్ ఇది!
Latest Gold-Silver Price Today 02 June 2023: పసిడి పరుగులు - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Gold-Silver Price Today 02 June 2023: తగ్గిన పసిడి మెరుపు - ఇవాళ బంగారం, వెండి ధరలు
Latest Gold-Silver Price Today 01 June 2023: దిగొచ్చిన పసిడి - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు